రూ. 40 కోట్ల భూమిపై అక్రమార్కుల కన్ను

రూ. 40 కోట్ల భూమిపై అక్రమార్కుల కన్ను
  • మహబూబాబాద్​లో రూ. 40 కోట్ల భూమిపై అక్రమార్కుల కన్ను
  • యధేచ్ఛగా చదును చేసి ఫెన్సింగ్​ ఏర్పాటు 
  • పక్కనే ఉన్న కుంటనూ పూడ్చేస్తున్రు
  • పట్టించుకోని ఆఫీసర్లు

మహబూబాబాద్ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సమీపంలో 551/1 సర్వే నంబర్​లో సుమారు 7.20 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. వారం రోజులుగా ఈ భూమిని జేసీబీలతో చదును చేసి ఫెన్సింగ్ ​ఏర్పాటు చేస్తున్నారు. కళ్లెదురుగానే ఇదంతా జరుగుతున్నా రెవెన్యూ ఆఫీసర్లు వారికేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి భూముల ధరలు కొండెక్కాయి. అంతేగాక ఇటీవల ప్రభుత్వం మెడికల్​ కాలేజీ ప్రకటించడంతో లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్లకు పడగలెత్తాయి. దీంతో రియల్​ఎస్టేట్​వ్యాపారులు, భూ అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. ఎక్కడ సెంటు భూమి కనిపించినా వదలడం లేదు. ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న పట్టా భూముల్లో కలుపుకొని మాయం చేస్తున్నారు.  
ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న మెడికల్ ​కాలేజీకి కూతవేటు దూరంలోనే సర్కారు భూమి ఉంది.  ఇక్కడ ఎకరం సుమారు రూ.2.5 కోట్లకు పైగా పలుకుతోంది. దీంతో భూమి కబ్జాకు ప్లాన్​ చేశారు. సర్కారు భూమి పక్కనే పోతిరెడ్డికుంట ఉంది. ఇందులో కొంత ప్రభుత్వ భూమి, మరికొంత పట్టాభూమి ఉంది. మొత్తం 22 ఎకరాల్లో కుంట ఉండగా దానికింద 55 ఎకరాల ఆయకట్టు ఉంది. సర్కారు భూమి కబ్జాతోపాటు పోతిరెడ్డి కుంటను సైతం పూడ్చేసేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. వారం క్రితం కుంటలో ఉన్న నీటిని బయటకు వదిలారు. ఈ ట్రాక్టర్లతో మట్టి తీసువచ్చి పూడుస్తున్నారు. ఇప్పటికే కుంటను సగానికి పైగా మట్టి పోసి చదును చేశారు. రూ. 40 కోట్ల విలువైన సర్కారు, కుంట భూమిని స్వాహా చేయాలని చూస్తున్నారు. కుంటను పూడ్చేస్తే పంట పొలాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంట నుంచి నీటిని బయటకు వదలడంతో చేపలు చనిపోయి తీరని నష్టం జరిగిందని మత్స్యకారులు వాపోతున్నారు. 

తెరవెనుక ప్రజాప్రతినిధులు
జిల్లా కేంద్రంలోని 551/1 సర్వే నంబర్​లో ప్రభుత్వ స్థలం, పోతిరెడ్డికుంట ఆక్రమణ వెనుక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు సైతం వారికి సహకరిస్తున్నారని సమాచారం.  సర్కారు భూమిని కబ్జా చేస్తున్నా.. నీటి వనరులు మాయం చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అంతేగాక ప్రభుత్వ భూమి 1.20 ఎకరాలు పట్టా నంబర్లతో ఓ మాజీ ప్రజాప్రతినిధి వ్యాపారులకు రిజిస్ర్టేషన్ సైతం చేశారు. అంతేగాక సమీపంలో 551/1 సర్వే నంబర్​లో ఉన్న రాష్ట్ర గృహానిర్మాణ సంస్థకు చెందిన వెయ్యి గజాల భూమిని కూడా ఆక్రమించుకునేందుకు కొందరు రంగంలోకి దిగారు. ఇక్కడ ఆ సంస్థకు సంబంధించిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో కోట్ల విలువైన భూమిని అక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

విచాణ చేసి చర్యలు తీసుకుటాం
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి రాలేదు. తహసీల్దార్​తో మాట్లాడి పూర్తిస్థాయిలో విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఆక్రమించినా, నీటి వనరులను పూడ్చి వేసినా.. ఎవర్ని వదిలిపెట్టం. వాటి రక్షణకు తగిన చర్యలు చేపడతాం. 
– కొమరయ్య, అడిషనల్​ కలెక్టర్, మహబూబాబాద్​ జిల్లా

కుంటలో మట్టి పోశారు
పోతిరెడ్డికుంట మత్స్య సొసైటీ పరిధిలో ఉంది. కొందరు వ్యక్తులు కుంటను కొంతకాలం నుంచి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఏటా రూ. లక్షల విలువైన చేప పిల్లలు పోస్తున్నాం. నీళ్లు బయటకు వదలడంతో చేప పిల్లలు చనిపోయి ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయాం. సగానికి పైగా కుంటలో మట్టి పోసి పూడ్చారు. కుంట పూడ్చేస్తే మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయి. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మాకు నష్ట పరిహారం చెల్లించి, కుంటకు రక్షణ కల్పించాలి.   – సింగాని ఆశోక్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు, మహబూబాబాద్