
- ఇప్పటికే ప్రచారంలో సీతక్క
- గురువారం బయల్దేరిన పాలమూరు ఎమ్మెల్యేలు
- త్వరలో అక్కడ ప్రచారానికి సీఎం రేవంత్, ఇతర మంత్రులు
హైదారాబాద్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్న యూపీలోని రాయ్‌బరేలిలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తరలివెళ్తున్నారు. ఇప్పటికే అక్కడ మంత్రి సీతక్క ప్రచారం చేస్తుండగా, గురువారం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, రాజేశ్ రెడ్డి, మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత ఇతర కాంగ్రెస్ నేతలు రాయ్‌బరేలి బాట పట్టారు. ఈ నేతలంతా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాయ్ బరేలి తరలివెళ్లారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారం నిర్వహించేందుకు వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాహుల్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఈ నెల 3న రేవంత్ అక్కడికి వెళ్లారు.
ఈ నెల 20తో అక్కడ ప్రచారం ముగియనుండడంతో ఒకటి, రెండు రోజుల్లో రేవంత్ ప్రచారం కోసం అక్కడకు వెళ్లనున్నారు. పలువురు మంత్రులు కూడా రాయ్‌బరేలికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకో వైపు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసేందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశాలో ప్రచారం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి రాహుల్ తో ఒడిశా వెళ్లిన భట్టి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.