మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి

మోదీ కనుసన్నల్లోనే  కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
  •    మోదీ కనుసన్నల్లోనే ఆయన పనిచేస్తున్నడు: కేకే మహేందర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన తన కూతురు కవితను జైలు నుంచి విడిపించడానికి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ ఓట్లు వేయించారని కాంగ్రెస్ సీనియర్ నేత, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్​చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్ లో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాజకీయ భవిష్యత్తు కోసం మోదీ దగ్గర మోకరిల్లిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన ఫైర్ అయ్యారు. కొడుకును సీఎంని చేయాలని తనను ఆడిగాడని స్వయంగా మోదీనే చెప్పారని.. ఈ నేపథ్యంలో వాళ్ల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏంటో తెలియాలన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు జల దోపిడీ చేశారని, సిరిసిల్ల జిల్లా పొలాలను ఎండబెట్టి కేసీఆర్ తన పొలాలకు నీళ్లు తీసుకెళ్లారని ఆరోపించారు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీ చేశారని దుయ్యబట్టారు. 

ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు: వెలిచాల

ఎన్నికలకు ముందే  బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ చెప్పారని, దీన్ని బట్టి వాళ్ల బంధం బయట పడిందన్నారు. బీఆర్ఎస్ అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ అని.. కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలకోరులని ఆయన విమర్శించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ వ్యక్తులం మేము. కేటీఆర్.. తెలంగాణకు మేము చేసిన సేవ ఏంటో మీ అయ్య కేసీఆర్ ను అడుగు”అని రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ కు మూడో స్థానమేనన్నారు. ఒకవేళ మీకు మూడో స్థానం వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము ఉందా అని కేటీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని ఆయన దుయ్యబట్టారు. కేటీఆర్ సిరిసిల్లకు వలస పక్షి అని, నేతన్నల చావుకు ఆయనే కారణని రాజేందర్ రావు విమర్శించారు.