యువరాజులెవరో? : ఈరోజు అండర్‌‌-‌‌‌‌ 19 వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌

యువరాజులెవరో? : ఈరోజు అండర్‌‌-‌‌‌‌ 19 వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌

యువరాజులెవరో?ఈరోజు అండర్‌‌-‌‌‌‌ 19 వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌
పోటీ పడనున్న ఇండియా‌‌‌‌–బంగ్లాదేశ్​.
మ్యాచ్‌‌ మధ్యాహ్నం 1.30 నుంచి.
ఫేవరెట్‌‌గా ప్రియమ్‌‌ గార్గ్‌‌సేన
తొలి టైటిల్‌‌ వేటలో బంగ్లాదేశ్‌‌

ఇటు డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌.. అత్యధికంగా నాలుగుసార్లు విశ్వవిజేత.. ఈ సారి కూడా అందరి ఫేవరెట్‌‌.. అందుకు తగ్గట్టుగానే ఓటమి లేకుండా ఫైనల్‌‌కు వచ్చిన ఇండియా…! అటు అనామక జట్టు.. అంచనాలే లేని ప్రత్యర్థి.. కానీ, సంచలన విజయాలతో తొలిసారి టైటిల్‌‌ ఫైట్‌‌కు దూసుకొచ్చిన బంగ్లాదేశ్‌‌..! కుర్రాళ్ల క్రికెట్‌‌లో తామే మొనగాళ్లం అనిపించుకునేందుకు ఈ రెండు ఆసియా జట్లు ఇప్పుడు అమీతుమీకి రెడీ అయ్యాయి..! మరి, తొలిసారి రెండు ఆసియా జట్లు తలపడుతున్న తుదిపోరులో గెలిచేదెవరు..?ఫస్ట్‌‌ ఫైనల్లోనే ప్రపంచాన్ని గెలవాలని తప్పిస్తున్న బంగ్లా పులులు గర్జిస్తారా?ఐదో ప్రపంచ కప్​కు అడుగు దూరంలో నిలిచిన మన కుర్రాళ్లు.. బంగ్లా అడ్డు దాటేసి అనుకున్నది సాధిస్తారా?  నేడే మెగా ఫైనల్​..! కుర్రాళ్ల సమరంలో గెలిచే యువరాజులెవరో  చూడాలి!

పొచెఫ్‌‌స్ట్రూమ్‌‌ (సౌతాఫ్రికా):  కుర్రాళ్ల క్రికెట్‌‌ సమరం తుది అంకానికి చేరింది. మెగా టోర్నీలో ఓటమి ఎరుగని ఇండియా, బంగ్లాదేశ్‌‌ మధ్య ఆదివారం టైటిల్‌‌ ఫైట్‌‌ జరగనుంది. డిఫెడింగ్ చాంప్‌‌ ఇండియానే ఈ మ్యాచ్‌‌లో ఫేవరెట్‌‌గా కనిపిస్తున్నా.. బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. రెండు జట్లలోనూ నాణ్యమైన ఆటగాళ్లకు కొదువ లేదు. దాంతో, ఆఖరాటలో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. ఈ మ్యాచ్‌‌లో ఇండియా గెలిస్తే ఐదో కప్పుతో (మూడు కప్పులతో ఆస్ట్రేలియాది సెకండ్‌‌ ప్లేస్‌‌) తన రికార్డును మరింత మెరుగు పరుచుకోనుంది. ఒకవేళ బంగ్లా గెలిస్తే ఏ లెవెల్లో అయినా దానికిదే తొలి ప్రపంచకప్‌‌ కానుంది. చివరగా 2018 వరల్డ్‌‌కప్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో రెండు జట్లు తలపడగా.. ఇండియా గెలిచింది. ఆ తర్వాత మిగతా టోర్నీల్లో ఏడుసార్లు తలపడగా రెండు మ్యాచ్‌‌లు వర్షంతో రద్దయ్యాయి. మిగతా ఐదు మ్యాచ్‌‌ల్లో ఇండియా 4–1తో మెరుగైన రికార్డుతో ఉన్నప్పటికీ ఇవన్నీ హోరాహోరీగా సాగడం గమనార్హం. లాస్ట్‌‌ టైమ్‌‌.. జులైలో ఇంగ్లండ్‌‌లో రెండు జట్లు తలపడితే.. బంగ్లా విజయం సాధించింది. అందువల్ల ఫైనల్లో ఏదైనా జరగొచ్చు. ఇక, రెండు దేశాల అభిమానులు జేపీ మార్క్స్‌‌ ఓవల్‌‌ స్టేడియానికి తరలివస్తుండగా.. ఇరు వైపులా ఎమోషన్స్‌‌ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. మరి, ఈ సందర్భాన్ని మధురజ్ఞాపకంగా మార్చుకొని.. దేశాన్ని గెలిపించి హీరోలయ్యే చాన్స్‌‌ను ఏ జట్టు కుర్రాళ్లు ఒడిసిపట్టుకుంటారో చూడాలి.

ఇండియా పవర్ఫుల్గా..

అండర్‌‌–19 క్రికెట్‌‌లో మోస్ట్‌‌ సక్సెస్‌‌ఫుల్‌‌ జట్టుగా పేరుతెచ్చుకున్న ఇండియా ఈ టోర్నీలో కూడా స్థాయికి తగ్గట్టు ఆడుతోంది. 2016లో ఎడిషన్‌‌ ఫైనల్లో వెస్టిండీస్‌‌తో ఓటమి తర్వాత ప్రపంచకప్స్‌‌లో వరుసగా 11 మ్యాచ్‌‌ల్లో విజయం సాధించిన మన కుర్రాళ్లు సమరోత్సాహంతో ఉన్నారు. ప్రియమ్‌‌ గార్జ్‌‌ కెప్టెన్సీలోని టీమ్‌‌ అన్ని డిపార్ట్‌‌మెంట్లలో అత్యంత పటిష్టంగా ఉంది. పానీపురి అమ్ముకునే దశ నుంచి స్టార్‌‌గా ఎదిగిన ఓపెనర్‌‌ యశస్వి జైస్వాల్‌‌ బ్యాటింగ్‌‌కు వెన్నెముక. టోర్నీలో 312 రన్స్‌‌తో అతనే టాప్‌‌ స్కోరర్‌‌. పైగా సెమీస్‌‌లో పాక్‌‌పై సెంచరీ చేసి ఫుల్‌‌జోష్‌‌లో ఉన్నాడు. అతని ఓపెనింగ్‌‌ పార్ట్‌‌నర్‌‌ దివ్యాంశ్​ సక్సేనా కూడా ఫామ్‌‌లో ఉండగా.. వన్‌‌డౌన్‌‌లో మరో టాలెంటెడ్‌‌ లెఫ్టాండర్‌‌, హైదరాబాద్‌‌ ఠాకూర్‌‌ తిలక్‌‌ వర్మతో టాపార్డర్‌‌ బలంగా ఉంది. వీరిలో ఒక్కరు క్రీజులో నిలిచినా భారీ స్కోరు ఖాయమే. కీపర్‌‌ ధ్రువ్‌‌ జురెల్‌‌, కెప్టెన్‌‌ ప్రియమ్‌‌ గార్గ్‌‌తో పాటు ఆల్‌‌రౌండర్లు సిద్దేశ్‌‌ వీర్‌‌, అథర్వ అంకోలేకర్‌‌తో మిడిల్‌‌, లోయరార్డర్‌‌ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఇండియా ప్రధాన ఆయుధం బౌలింగే. పేసర్లు కార్తీక్‌‌ త్యాగి, సుశాంత్‌‌ మిశ్రా, ఆకాశ్‌‌ సింగ్‌‌ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌‌ చేస్తున్నారు. ముఖ్యంగా నిలకడగా 135 కి.మి. స్పీడ్‌‌తో బౌలింగ్‌‌ చేస్తున్న కార్తీక్‌‌ ఈ మ్యాచ్‌‌లోనూ కీలకం కానున్నాడు. ఇక, లెగ్‌‌ స్పిన్నర్‌‌ రవి బిష్నోయ్‌‌ బౌలింగ్‌‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్‌‌మెన్‌‌కు పిచ్‌‌ మీదసామే. అతనికి అంకోలేకర్‌‌ నుంచి మంచి సహకారం లభిస్తోంది. తొలి మ్యాచ్‌‌లో 298 రన్స్‌‌ ఛేజింగ్‌‌లో శ్రీలంక 207 రన్స్‌‌ చేయడం మినహా మిగతా నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ ప్రత్యర్థిని 200లోపే ఆలౌట్‌‌ చేసిందంటే ఇండియా బౌలింగ్‌‌ ఎంత పదునుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే ఐదో కప్పు నెగ్గడం కష్టమేమీ కాకపోచ్చు.

బంగ్లా తక్కువేం కాదు

ఫస్ట్‌‌ టైమ్‌‌ ఫైనల్‌‌కు వచ్చినప్పటికీ బంగ్లాదేశ్‌‌ కూడా టోర్నీలో ఇప్పటిదాకా అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేసింది. తాము ట్రోఫీ నెగ్గుతామని టోర్నీకి ముందే ఆ జట్టు కెప్టెన్‌‌ అక్బర్‌‌ అలీ స్టేట్‌‌మెంట్‌‌ ఇవ్వగా…  అందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిందంటే ఆ జట్టు ఎంత కాన్ఫిడెన్స్‌‌తో ఉందో చెప్పొచ్చు. ఆ జట్టులో కూడా మ్యాచ్‌‌ విన్నర్లకు కొదువలేదు. యశస్వి మాదిరిగా బంగ్లా టాపార్డర్‌‌లో తన్‌‌జిత్‌‌ హసన్‌‌ అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్‌‌తో సెమీస్‌‌లో సెంచరీ హీరో మహ్ముదుల్‌‌ హసన్‌‌ జాయ్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నాడు. ఇక, స్పిన్నర్‌‌ రవి బిష్నోయ్‌‌కు పోటీగా రకిబుల్‌‌ హసన్‌‌ బంతిని గిరగిరా తిప్పేస్తున్నాడు. మన పేస్‌‌ ద్వయం కార్తీక్‌‌ త్యాగి, సుశాంత్‌‌ మిశ్రా స్పీడ్‌‌కు తగ్గట్టు తన్జిమ్‌‌ హసన్‌‌, షోరిఫుల్‌‌ ఇస్లామ్‌‌ కౌంటర్‌‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. పాకిస్థాన్​తో మ్యాచ్‌‌లో మినహా బంగ్లా టాపార్డర్‌‌ టోర్నీలో నిలకడగా ఆడింది. రెండు జట్లు సెమీస్‌‌లో ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగే చాన్సుంది.

వాన ముప్పు.. రేపు రిజర్వ్‌‌ డే

ఈ మ్యాచ్‌‌కు వర్షం ముప్పు ఉంది. ఆదివారం,  రిజర్వ్‌‌ డే అయిన సోమవారం  ఏదో ఒక సమయంలో భారీ వర్షం వచ్చే చాన్సుంది. మొదటి రోజు మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. అక్కడి నుంచే రిజర్వ్‌‌ డే రోజు ఆట కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఆట సాధ్యం కాకపోతే ఇరు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి.

జట్లు (అంచనా)

ఇండియా: యశస్వి, దివ్యాంశ్​​ సక్సేనా, తిలక్‌‌ వర్మ, ధ్రువ్‌‌ జురెల్‌‌ (కీపర్‌‌), ప్రియమ్‌‌ గార్గ్‌‌ (కెప్టెన్‌‌), సిద్దేశ్‌‌ వీర్‌‌, అథర్వ అంకోలేకర్‌‌, రవి బిష్నోయ్‌‌, సుశాంత్‌‌ మిశ్రా, కార్తీక్‌‌ త్యాగి, ఆకాశ్‌‌ సింగ్‌‌.

బంగ్లాదేశ్‌‌:  పర్వేజ్‌‌, తన్జిద్‌‌ హసన్‌‌, మహ్ముదుల్‌‌ హసన్‌‌, తౌహిత్‌‌ హ్రిదాయ్‌‌, షహదత్‌‌ హుస్సేన్‌‌, షమీమ్‌‌ హుస్సేన్‌‌, అక్బర్‌‌ అలీ (కెప్టెన్‌‌, కీపర్‌‌), రకిబుల్‌‌ హసన్‌‌, షోరిఫుల్‌‌ ఇస్లాం, తన్జిమ్‌‌ హసన్‌‌ షకీబ్‌‌, హసన్‌‌ మురాద్‌‌.

పిచ్‌‌ ఎలా ఉందంటే..

ఇండియా-–పాకిస్థాన్‌‌ సెమీస్‌‌ జరిగిన వికెట్‌‌నే ఈ మ్యాచ్‌‌కూ వాడనున్నారు. బౌలింగ్‌‌తో పాటు బ్యాటింగ్‌‌కు కూడా అనుకూలించిన పిచ్‌‌ స్వభావంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.

మరిన్ని వార్తల కోసం