Summer Health : ఎండాకాలం గాలితో ప్రమాదం.. చర్మ వ్యాధుల ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా..!

Summer Health : ఎండాకాలం గాలితో ప్రమాదం.. చర్మ వ్యాధుల ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా..!

వేసవి గాలితో జాగ్రత్త

వేసవిలో ఎండ తీవ్రత, వేడిగాలి కారణంగా గాలి నుంచి సోకే బ్యాక్టీరియా మరింత వేగంగా ఒంట్లోకి ప్రవేశిస్తుంది. శరీరంలో ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్.. పీల్చుకునే గాలి నుంచే లభిస్తుంది. ఇది ముందుగా ఊపిరితిత్తుల్లోకి.. అక్కడ్నుంచి రక్తంలోకి చేరుకొని.. హిమోగ్లోబిన్ తో జతకట్టి అన్నికణాలకు చేరుతుంది. అందుకేగాలిలో తీవ్రమైన దుమ్ము, ధూళి, కాలుష్యం చేరినప్పుడు ముక్కు నుంచి గుండె వరకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. పైగా మనదేశంలో ఎక్కువ కాలుష్యం కలిగిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. కాబట్టి మరింత జాగ్రత్త అవసరం అంటున్నారు డాక్టర్స్

ధూళి కణాల ఎఫెక్ట్

గాలిలో ఉండే దుమ్ము.. కలుషిత రసాయనాలతో వెంటనే కలిసిపోతుంది. సిటీలో కాలుష్యం వల్ల ఏర్పడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్, కార్బాక్సీలిక్ యాసిడ్ లాంటివి గాలిలోని దుమ్ము, ధూళితో కలిసిపోయి చిన్న చిన్న కణాల్లా ఏర్పడతాయి. ఈ ధూళి కణాలు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. పది మైక్రాన్ల కంటే ఎక్కువ సైజు ఉండే కణాలు కింద పడిపోతాయి.. కానీ రెండు నుంచి పది మైక్రాన్లలోపు అలా తేలియాడుతూ ఉంటాయి. ఇవి మనం శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు, శ్వాసనాళం గుండా ప్రయాణించి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి పలు సమస్యలకు దారితీస్తాయి.

సమస్యలు ఇవే..

ఎండాకాలం గాలి ప్రభావం వల్ల కళ్ల మంటలు, దురద, నీరు రావటం వంటివి తలెడొచ్చు. వేడి గాలిలోని దుమ్ము, ధూళి ముక్కులో ప్రవేశించినప్పుడు ముక్కులో అలర్జీ పుడుతుంది. దాని వల్ల మంట, నీరు కారటం, దురద వంటివి మొదలవుతాయి. కొంతమందిలో సైనసైటిస్ ప్రాబ్లమ్ కూడా రావొచ్చు. ఇక ఇంకో ముఖ్యమైన సమస్య అస్తమా. దుమ్ము, వాహనాల నుంచి వెలువడే రసాయనాలు శ్వాస ద్వారా లోపలికి వెళ్లినప్పుడు, శ్వాసనాళాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం కుచించుకుపోతుంది. ఇది అస్తమాకు దారితీస్తుంది. దీనివల్ల దగ్గు, ఛాతిలో బరువుగా ఉండటం వంటి లక్షణాలు వేధిస్తాయి. ఇక అస్తమా ఉన్న పేషెంట్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎండాకాలం మరింత సమస్యగా మారుతుంది.

సీఓపీడీ (క్రానిక్ అన్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్)

గుండె మన శరీరానికి శక్తి కోసం ఆక్సిజన్ను వినియోగించుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని ఫ్రీరాడికల్స్ విడుదలవుతుంటాయి. వీటిని యాంటీ ఆక్సిడెంట్లు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయటమో, ఒంట్లోంచి బయటకు పంపించడమో చేస్తుంటాయి. అయితే కొందరిలో ఈ ప్రక్రియ దెబ్బతిని వాపుకు దారి తీస్తుంది. దీంతో సీఓపీడీ వంటి సమస్యలతో పాటు గుండెజబ్బులు, పక్షవాతం వంటి జబ్బులు కూడా తలెత్తవచ్చు. 

పిల్లలపై కూడా

చిన్నపిల్లలో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందవు. వీరిలో రోగనిరోధకశక్తి కూడా తక్కువే. అందువల్ల పెద్దల కన్నా పిల్లలపై ఇలాంటి ఇన్ఫెక్షన్లు మరింత ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే సిటీలోని పిల్లలో 20 శాతం ఎక్కువ మంది ఆస్తమాతో బాధపడుతున్నారని కొన్ని సర్వేలో తేలింది.

గుండెకు కూడా

కలుషితమైన గాలిని పీల్చినప్పుడు ఆక్సిజన్ కన్నా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువమొత్తంలో శరీరంలోకి వెళ్తుంది. ఇది హిమోగ్లోబిన్లో జతకూడి కార్బాక్సీహిమోగ్లోబిన్ ఏర్పడుతుం ది.దీంతో గుండెకు రక్తసరఫరా తగ్గిపోయి. గుండెపోటు రావొచ్చు. వాయు కాలుష్యంతో తెల్లరక్తకణాల సంఖ్య కూడా మారిపోతున్నట్టు, ఇది గుండె రక్తనాళాల పనితీరును మార్చేస్తు న్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. మెదడుకు రక్తసరఫరా చేసే నాళాల్లో ఇలాంటి పరిస్థితే ఏర్పడితే పక్షవాతం రావొచ్చు.


ఏం చేయాలి

• వేసవిలో బయటకు వెళ్లినపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవటం తప్పనిసరి. వీలైతే నాసల్ ఫిల్టర్లు ధరించటం ఇంకా ఉత్తమం. 
• కాలుష్య వాతావరణంలో గడిపితే పొగతాగినట్టే లెక్క. అందువల్ల ట్రాఫిక్ ఎక్కువగా తిరిగే వాళ్లు పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. 
• శ్వాస ద్వారా వచ్చే సమస్యలు కేవలం బయటమాత్రమే కాదు. ఇంట్లో వాడుకునే వస్తువుల నుంచి కూడా వస్తాయి. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
•దిండు కవర్లు, దుప్పట్లను వారానికి ఒకసారి వేడి నీటిలో ఉతికి, ఎండలో ఆరబెట్టుకోవాలి. దులిపితే వాటిపై ఉండే దుమ్ము గాలిలో కలుస్తుంది. కాబట్టి ఏ వస్తువునైనా తడిగుడ్డతో తుడుచుకోవటం మంచిది.
• వంటింట్లోంచి పొగ బయటకు వెళ్లేలా ఫ్యాను, చిమ్నీల వంటివి ఏర్పాటు చేసుకోవాలి. వంటచెరకు, కిరోసిన్ కు బదులు గ్యాస్ వాడుకోవాలి. మస్కిటో కాయిల్స్ కు బదులు దోమతెరలు వాడుకోవటం ఉత్తమం.
•మన శరీరానికి అవసరమైన 80శాతం శక్తి ఆక్సిజన్ నుంచే లభిస్తుంది. కాబట్టి దుమ్ము, ధూళి ద్వారా ఆక్సిజన్ సరిగా అందకపోతే అలసట వస్తుంది. నిస్సత్తువ, చిరాకు వంటివి. వస్తాయి. కొందరిలో ఇది ఒత్తిడికి సైతం దారితీయొచ్చు. అందుకే రోజూ ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాస ప్రక్రియను శుద్ధి చేసుకోవచ్చు.