146 జిల్లాలు.. 7 రోజులు.. జీరో కేసులు

146 జిల్లాలు.. 7 రోజులు.. జీరో కేసులు
  • సెంట్రల్‌ హెల్త్‌ మినిస్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడి
  • రోజువారీ కేసులు పదివేల లోపే
  • ఇందులోనూ 70% మహారాష్ట్ర, కేరళల్లోనే
  • ప్రస్తుతం రోజుకు 12 లక్షల టెస్టులు
  • ఇప్పటివరకు 25 లక్షల మందికి వ్యాక్సిన్‌
  • ప్రస్తుతం దేశంలో 165 బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కేసులు

న్యూఢిల్లీ:

దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. 146 జిల్లాల్లో వారం రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. 18 జిల్లాల్లో 14 రోజులుగా, 6 జిల్లాల్లో 21 రోజులుగా, 21 జిల్లాల్లో 28 రోజులుగా కేసులేవీ రిజిస్టర్‌ అవలేదన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌తో గురువారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై చర్చించారు. దేశంలో ప్రస్తుతం 1.73 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయని, వీళ్లలో 0.46 శాతం మందే వెంటిలేటర్‌పై ఉన్నారని మంత్రి తెలిపారు. మరో 2.20 శాతం మంది ఐసీయూలో, 3.02 శాతం మంది ఆక్సిజన్‌ సపోర్ట్‌పై ఉన్నారని చెప్పారు. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 5 వేల లోపే కేసులున్నాయన్నారు. ఇప్పటివరకు బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కేసులు 165 నమోదయ్యాయని, వీళ్లందరినీ సింగిల్‌ రూమ్‌లలో ఉంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నామని తెలిపారు.  .

1.4 శాతానికి తగ్గిన డెత్‌ రేటు

దేశంలో కరోనా కేసుల గ్రోత్‌ రేటు 0.90 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అతి తక్కువని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ సుజీత్‌ కే సింగ్‌ వెల్లడించారు. మరణాలు రేటు కూడా బాగా తగ్గిందని, జూన్‌లో 3.4 శాతంగా ఉన్న డెత్‌ రేటు ప్రస్తుతం 1.4 శాతంగా ఉందని వివరించారు. దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయ్యూ 99.79 రికవరీ రేటుతో  దేశంలో ముందున్నాయని తెలిపారు. దేశంలోని మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 70 శాతం మహారాష్ట్ర, కేరళల్లోనే ఉన్నాయన్నారు. దేశంలో ఇప్పటివరకు కోటీ 7 లక్షల మందికి వైరస్‌ సోకగా వీరిలో కోటీ 3 లక్షల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. లక్షా 53 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలో 5వ ప్లేస్‌

వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలో ఇండియా 5వ ప్లేస్‌లో ఉందని, ఇంకొద్ది రోజుల్లోనే మూడో ప్లేస్‌కు వెళ్తుందని సెంట్రల్‌ హెల్త్‌ సెక్రటరీ రాజేశ్‌ భూషన్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 25 లక్షల మంది వ్యాక్సిన్‌ వేశామన్నారు.
వ్యాక్సినేషన్‌కు ప్రపంచదేశాలతో పోలిస్తే మన దగ్గరే తక్కువ టైమ్‌ పడుతోందన్నారు. ఆరు రోజుల్లోనే 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసి రికార్డు సృష్టించామని, ఇంత మందికి వ్యాక్సిన్‌ వేయడానికి అమెరికాకు 10 రోజులు, స్పెయిన్‌కు 12, ఇజ్రాయెల్‌కు 14, బ్రిటన్‌కు 18 రోజులు పట్టిందని చెప్పారు. లక్ష్యద్వీప్‌లో 83 శాతం మంది హెల్త్‌ వర్కర్లకు ఇప్పటికే వ్యాక్సిన్‌ వేశారని.. ఒడిశాలో 50.7 శాతం, హర్యానాలో 50 శాతం మందికి వేశారని వివరించారు. తమిళనాడు (15.7%), ఢిల్లీ (15.7), జార్ఖండ్‌ (14.7), ఉత్తరాఖండ్‌ (17) మెరుగవ్వాల్సి ఉందన్నారు.

రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరోనా కంట్రోల్

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని 11 జిల్లాల్లో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. నారాయణపేట్‌లో గడిచిన వారం రోజుల్లో 2 కేసులే నమోదవగా గద్వాల్‌లో 3 కేసులే నమోదైనట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఆసిఫాబాద్‌, నాగర్‌‌ కర్నూల్‌, నిర్మల్, సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ రూరల్, కామారెడ్డి, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో గత వారం రోజుల్లో కలిపి 20 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ రోజూ 20 కంటే తక్కువ కేసులే వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో వారం రోజుల్లో సగటున 35 కేసులు నమోదయ్యాయి. వా టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. రోజూ 30 వేలకు మించి చేయట్లేదు. కేసుల సంఖ్య తగ్గడానికి ఇదీ కారణమై ఉండొచ్చని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. హెల్త్‌ డిపార్ట్‌మెంట్ ఇప్పటికీ కేసులను తగ్గించి చూపిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా, బుధవారం కొత్తగా 186 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 2,93,923కు చేరగా 2,89,631 మంది కోలుకున్నారంది. కొత్తగా 31,119 టెస్టులు చేశామని, మొత్తం టెస్టుల సంఖ్య 77,59,415కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది. కరోనాతో మరొకరు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,594కు చేరింది.