దేశంలో 65శాతం సంపద 10 శాతం మంది దగ్గర్నే

దేశంలో 65శాతం సంపద 10 శాతం మంది దగ్గర్నే
  • అసమానతలు ఎక్కువున్న టాప్​ దేశాల్లో ఇండియా
  • సగటు ఆదాయం 2.04 లక్షలు ఉంటే..ఇందులో 50% మంది సంపాదన రూ.53 వేలే
  • వరల్డ్​ ఇనీక్వాలిటీ రిపోర్ట్​లో వెల్లడి

న్యూఢిల్లీ: ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఉందని వరల్డ్​ ఇనీక్వాలిటీ రిపోర్ట్​ 2022 వెల్లడించింది. దేశంలో పేదరికం పెరిగిపోతోందని తెలిపింది. ఆదాయంలో ఉన్నత వర్గాల వాటా ఏటేటా పెరిగిపోతుంటే, కిందిస్థాయిలో ఉన్నోళ్ల వాటా ఇంకా తగ్గుతోందని పేర్కొంది. దేశ ఆదాయంలో 65 శాతం కేవలం 10 శాతం మంది దగ్గర, అందులోనూ 22 శాతం ఆదాయం కేవలం ఒక్క శాతం జనాభా దగ్గరే ఉందని తెలిపింది. అట్టడుగు వర్గాలకు చెందిన 50 శాతం జనం సంపాదించే మొత్తం కేవలం 13 శాతమేనని వివరించింది.
ఆదాయం, సంపదలో..
దేశంలో సగటున ఒక్కో వ్యక్తి ఆదాయం రూ.2,04,200  ఉండగా.. 50 శాతం జనాభా సంపాదించేది కేవలం రూ.53,610 మాత్రమేనట. వీరికి 20 రెట్లు ఎక్కువగా.. 10 శాతం జనాభా ఆదాయం రూ.11,66,520 ఉందన్నారు. మధ్య తరగతి వారి వద్ద 29.5 శాతం సంపద ఉందని వెల్లడించింది. అదే పైన ఉన్న 10 శాతం మంది వద్ద 65 శాతం, 1 శాతం మంది దగ్గర 33 శాతం సంపద ఉన్నట్లు తెలిపింది. మధ్యతరగతి వారి వద్ద సగటున రూ.7,23,930ల సంపద ఉన్నట్లు నివేదించింది. అదే పైన ఉన్న 10 శాతం మంది దగ్గర సగటున రూ.63,54,070, ఒక శాతం మంది వద్ద రూ.3,24,49,360 సంపద ఉన్నట్లు తెలిపింది. జెండర్​ విషయంలో..
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణల వల్ల ఉన్నత వర్గాలకు చెందిన ఒక్క శాతం మంది భారీగా లాభపడ్డారని ఈ రిపోర్టు తెలిపింది. జెండర్​ విషయంలోనూ దేశంలో ఇనీక్వాలిటీ ఎక్కువే ఉందని చెప్పింది. ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగతా దేశాల్లో మహిళా కార్మిక ఆదాయ వాటా 21 శాతం ఉండగా.. ఇండియాలో ఇది కేవలం 18 శాతం మాత్రమేనని వరల్డ్​ ఇనీక్వాలిటీ రిపోర్టు వెల్లడించింది.