సిరీస్‌‌పై టీమిండియా కన్ను

సిరీస్‌‌పై టీమిండియా కన్ను
  • నేడు విండీస్‌‌తో మూడో వన్డే
  • పరువు కోసం కరీబియన్ల ఆరాటం
  • ధవన్‌ గాడిలో పడేనా!
  • గేల్‌‌కు వీడ్కోలు మ్యాచ్‌‌ 

1, 23, 3, 2…  గత నాలుగు మ్యాచ్‌‌ల్లో ధవన్‌‌ చేసిన పరుగులివి..! ఒకప్పుడు విదేశీ పిచ్‌‌లపై అందరికంటే ఎక్కువగా చెలరేగే గబ్బర్‌‌.. ఈసారి కరీబియన్‌‌ టూర్‌‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు..! ఎంతలా అంటే.. వేగంగా లోపలికి దూసుకొచ్చే బంతులను కూడా సరిగ్గా డిఫెన్స్‌‌ చేయలేని స్థితికి వచ్చాడు..! పొట్టి ఫార్మాటే అనుకుంటే వన్డేల్లోనూ ఇదే కొనసాగుతోంది.. ! గాయం నుంచి కోలుకున్న తర్వాత వరల్డ్‌‌కప్‌‌ ఫామ్‌‌ను చూపెడతాడని భావించినా.. ఆ స్థాయిలో మెరుపులు మాత్రం రావడం లేదు..! కాబట్టి తాను గాడిలో పడాలనుకున్నా.. తన ఫామ్‌‌పై ఆందోళన చెందుతున్న టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కు ఉపశమనం కలిగించాలనుకున్నా.. విండీస్‌‌తో మూడో వన్డేనే అతనికి ఆఖరి అవకాశం..!!

పోర్ట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్పెయిన్‌‌‌‌: కరీబియన్లపై టీ20 సిరీస్‌‌‌‌ గెలిచి జోరుమీదున్న టీమిండియా.. వన్డే సిరీస్‌‌‌‌నూ సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం విండీస్‌‌‌‌తో జరిగే చివరిదైన మూడో వన్డేలోనూ సత్తా చాటాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో విరాట్‌‌‌‌సేన 1–0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌‌‌‌ వర్షం వల్ల రద్దయింది. రెండో వన్డేలో ఇండియా అద్భుత విజయం సాధించింది. మూడో మ్యాచ్‌‌‌‌లోనూ నెగ్గి అపజయం లేకుండా టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను మొదలుపెట్టాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఇప్పటికే టీ20 సిరీస్‌‌‌‌ కోల్పోయి ఇంటా, బయటా తీవ్ర విమర్శపాలైన విండీస్‌‌‌‌… ఇప్పుడు పరువు కాపాడుకునే పనిలో పడింది. కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా గెలిచి వన్డే సిరీస్ చేజారకుండా చూడాలని వ్యూహాలు రచిస్తోంది.

ధవన్‌‌‌‌ ఏం చేస్తాడో!

సిరీస్‌‌‌‌ డిసైడ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కావడంతో విరాట్‌‌‌‌సేన తుది జట్టులో మార్పులు చేయడం లేదు. రెండో వన్డేలో ఆడిన టీమ్‌‌‌‌నే యధావిధిగా ఆడించనుంది.  గాయం నుంచి కోలుకుని మళ్లీ బ్యాట్‌‌‌‌ పట్టిన గబ్బర్‌‌‌‌ ఫామ్‌‌‌‌పై ప్రస్తుతం అందరూ ఆందోళన చెందుతున్నారు. లోపలికి దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడంలో ధవన్‌‌‌‌ పూర్తిగా తడబడుతున్నాడు. రెండుసార్లు కొట్రెల్‌‌‌‌ ఇలాంటి బాల్స్‌‌‌‌తోనే అతన్ని ఔట్‌‌‌‌ చేయడం గమనార్హం. టెస్ట్‌‌‌‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ ఢిల్లీ ప్లేయర్‌‌‌‌ గాడిలో పడటానికి ఈ మ్యాచ్‌‌‌‌ ఆఖరి అవకాశం. లేదంటే స్వదేశంలో జరిగే సిరీస్‌‌‌‌లకు ప్రత్యామ్నాయంగా రాహుల్‌‌‌‌ను దించినా ఆశ్చర్యం లేదు. రోహిత్‌‌‌‌ కూడా మంచి ఇన్నింగ్స్‌‌‌‌ బాకీ ఉన్నాడు. రెండో వన్డేలో ఈ ఇద్దరూ విఫలమైనా.. కోహ్లీ సూపర్‌‌‌‌ సెంచరీతో చెలరేగాడు. దాదాపు ఐదు నెలల తర్వాత (11 ఇన్నింగ్స్‌‌‌‌) కెప్టెన్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ పరుగుల వరద పారించడం బలం చేకూర్చే అంశం. మిడిలార్డర్‌‌‌‌లో ‘నాలుగో స్థానం’ భర్తీ కావడం లేదు. పంత్‌‌‌‌కు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అండగా నిలిచినా.. ఈ యువ వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ చాన్స్‌‌‌‌ను ఒడిసిపట్టుకోలేకపోతున్నాడు. ఐదో స్థానంలో శ్రేయస్‌‌‌‌ కేక పుట్టిస్తున్నాడు. చోటు శాశ్వతం చేయాలని మాజీల డిమాండ్‌‌‌‌ నేపథ్యంలో ఇంకొక్క బలమైన ఇన్నింగ్స్‌‌‌‌ ఆడితే ఈ ముంబైకర్‌‌‌‌కు తిరుగుండదు. కేదార్‌‌‌‌కు ఇదే చివరి మ్యాచ్‌‌‌‌. ఇందులో రాణించకపోతే కెరీర్‌‌‌‌కు ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పడ్డట్లే. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా జడేజా పాత్ర మరింత పెరగాలి. బౌలింగ్‌‌‌‌లో భువనేశ్వర్‌‌‌‌ సూపర్బ్‌‌‌‌. షమీ కూడా సహకరిస్తే సిరీస్‌‌‌‌ గెలుపు నల్లేరుమీద నడకే. ఖలీల్‌‌‌‌ బంతులు వేయడంలో మరింత పరిణతి సాధించాలి. స్పిన్నర్‌‌‌‌గా కుల్దీప్‌‌‌‌  ఇంకాస్త ప్రభావం చూపాలి. ఓవరాల్‌‌‌‌గా రెండో మ్యాచ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ పునరావృతమైతే సిరీస్‌‌‌‌ టీమిండియాదే.

గేల్‌‌‌‌పై అందరి దృష్టి..

సొంతగడ్డపై కరీబియన్ల ఆట మరింత దిగజారుతోంది. రెండో వన్డే ఛేజింగ్‌‌‌‌లో ఓ దశలో విండీస్‌‌‌‌ గెలవాలంటే 71 బంతుల్లో 96 రన్స్‌‌‌‌ కావాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌‌‌‌లో హిట్టర్‌‌‌‌ పూరన్‌‌‌‌ ఉన్నాడు. కొద్దిగా సాహసం చేస్తే సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌. కానీ పూరన్‌‌‌‌ ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌‌‌‌ పేకమేడలా కూలింది. ఫలితంగా 179/4తో పటిష్టంగా ఉన్న ఇన్నింగ్స్‌‌‌‌ 182/8కు పడింది. విండీస్‌‌‌‌ టీమ్‌‌‌‌లో సమష్టితత్వం లోపించిందనడానికి ఈ ఒక్క గణాంకం చాలు. ఈ తప్పును దిద్దుకోకపోతే ఈ సిరీస్‌‌‌‌కూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కెరీర్‌‌‌‌లో ఆఖరి వన్డే ఆడుతున్న గేల్‌‌‌‌ విజృంభణ కోసం కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. వరుసగా

విఫలమవుతున్న లూయిస్‌‌‌‌ స్థానంలో క్యాంప్‌‌‌‌బెల్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇవ్వొచ్చు. మిడిలార్డర్‌‌‌‌లో హోప్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌, పూరన్‌‌‌‌, ఛేజ్‌‌‌‌ బ్యాట్లు ఝుళిపించాల్సిన సమయం ఆసన్నమైంది. బలమైన పేస్‌‌‌‌ బౌలర్లు అందుబాటులో ఉన్నా.. టీమిండియా లైనప్‌‌‌‌కు పగ్గాలు వేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హోల్డర్‌‌‌‌, బ్రాత్‌‌‌‌వైట్‌‌‌‌, కొట్రెల్‌‌‌‌, థామస్‌‌‌‌.. వీళ్లలో ఏ ఒక్కరు చెలరేగినా భారీ స్కోరుకు అడ్డుకట్ట పడ్డట్లే. స్పిన్నర్‌‌‌‌గా ఛేజ్‌‌‌‌ వైఫల్యం నిరాశపరుస్తోంది. ఏదేమైనా సిరీస్‌‌‌‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌‌‌‌లో కరీబియన్లు సర్వశక్తులు ఒడ్డాల్సిందే.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, ధవన్‌‌, పంత్‌‌, శ్రేయస్‌‌, జాదవ్‌‌, జడేజా, భువనేశ్వర్‌‌, షమీ, ఖలీల్‌‌, కుల్దీప్‌‌.

వెస్టిండీస్‌‌: హోల్డర్‌‌ (కెప్టెన్‌‌), గేల్‌‌, ఎవిన్​లూయిస్‌‌/క్యాంప్‌‌బెల్‌‌, హోప్‌‌, హెట్‌‌మయర్‌‌, పూరన్‌‌, ఛేజ్‌‌, బ్రాత్‌‌వైట్‌‌, రోచ్‌‌, కొట్రెల్‌‌, థామస్‌‌.

పిచ్‌‌, వాతావరణం

బ్యాటింగ్‌‌కు అనుకూలం. వాతావరణం మేఘావృతంగా ఉంటుంది. పేస్‌‌ బౌలర్లు ప్రభావం చూపించొచ్చు. గత ఆరు వన్డేల్లో ఐదింటిలో ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన టీమే గెలిచింది. వర్షం ముప్పు ఉంది.