ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తం

ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తం

ఎల్మవు (జర్మనీ): రష్యా– ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన భద్రత అనేది పెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సొంత ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో తమకు బెస్ట్ అని భావించే పనిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘‘రష్యా – ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియా వైఖరిని జీ7 సెషన్స్‌‌‌‌లో ప్రధాని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని, దౌత్య మార్గాన్ని అనుసరించాలని చెప్పారు” అని మీడియాకు విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాట్రా చెప్పారు. జీ7 సమ్మిట్‌‌‌‌లో రష్యా– ఉక్రెయిన్ అజెండాపై, మాస్కోపై విధించిన ఆంక్షల వల్ల ఇండియాపై ఏదైనా ఒత్తిడి పడుతున్నదా అన్న ప్రశ్నలకు ఆయన స్పందించారు. ‘‘వాతావరణం, ఎనర్జీ.. ఆహార భద్రత, లింగ సమానత్వంపై ఇండియా వైఖరిని ప్రధాని స్పష్టం చేశారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థల ఆహార భద్రత కోసం సహకారం అందించడంలో ఇండియా ముందంజలో ఉందని తెలిపారు. గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ విషయంలో ప్రశ్నలు తలెత్తితే.. ఇండియా తన సొంత ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఉత్తమమైన పనిని చేయడాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.

ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తం..

ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, యూఎన్‌‌‌‌ చార్టర్‌‌‌‌‌‌‌‌లో పొందుపరిచిన సూత్రాలను కాపాడుతామని జీ7, దాని ఐదు భాగస్వామ్య దేశాలు చెప్పాయి. ఈమేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘‘జర్మనీ, అర్జెంటీనా, కెనడా, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సెనెగల్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, అమెరికా, ఈయూ దేశాల లీడర్లమైన మేము.. మా ప్రజాస్వామ్యాలను బలోపేతం చేయడం, సమానత్వం కోసం పని చేయడంలో.. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి సహా ప్రపంచ సవాళ్లకు సమగ్రమైన, స్థిరమైన పరిష్కారాలు కనుగొనే విషయంలో  కట్టుబడి ఉన్నాం” అని అందులో పేర్కొన్నారు. 

రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తం: జీ7 దేశాల ప్రతిజ్ఞ

రష్యాపై తీవ్రమైన, ఆర్థిక ఆంక్షలను విధిస్తామని జీ7 దేశాలు ప్రకటించాయి. చమురు అమ్మకాల ద్వారానే రష్యా చేస్తున్న యుద్ధానికి నిధులు సమకూరుతున్నాయని, రష్యాకు వచ్చే ఆదాయాన్ని కట్టడి చేసేందుకు తాము విస్తృతమైన చర్యలను అన్వేషిస్తామని చెప్పాయి. రష్యా నుంచి వచ్చే బంగారు దిగుమతిపై నిషేధం విధించేందుకు ఓకే చెప్పాయి. ఉక్రెయిన్‌‌‌‌ నుంచి ఆహారా ధాన్యాల సరఫరా నిలిచిపోయిన దేశాలకు సాయం చేయాలని నిర్ణయించాయి. 

యూఏఈ ప్రెసిడెంట్‌‌‌‌ను కలిసిన మోడీ

అబుదాబి: యూఏఈ ప్రెసిడెంట్, అబుదాబి రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. మాజీ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌‌‌‌ మృతికి ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. మంగళవారం అబుదాబి ప్రెసిడెన్షియల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ కు చేరుకున్న ప్రధానికి రాయల్ ఫ్యామిలీలోని సభ్యులతో కలిసి షేక్ మహమ్మద్ ఆహ్వానం పలికారు. ‘‘అబుదాబి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పలికిన ప్రత్యేక ఆహ్వానం నా మనసును తాకింది. ఆయనకు నా ధన్యవాదాలు” అని ఇంగ్లిష్, అరబిక్ భాషల్లో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

ప్రపంచ నేతలకు ప్రధాని కానుకలు

జీ7 సమ్మిట్ కోసం వచ్చిన ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ కానుకలు అందజేశారు. అమెరికా అధ్యక్షుడికి గులాబీ మీనాకరి, జర్మనీ చాన్స్‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌కి ఇత్తడి కుండ, జపాన్ ప్రధానికి నల్ల కుండలు, బ్రిటన్ ప్రధానికి ప్లాటినం పెయింట్ వేసిన టీ సెట్, ఫ్రెంచ్ ప్రధానికి జర్డోజి బాక్స్‌‌‌‌లో పెట్టిన అత్తరు బాటిళ్లు, ఇటలీ ప్రధానికి మార్బల్ కళాఖండం, సెనెగల్ ప్రెసిడెంట్‌‌‌‌కి మూంజ్‌‌‌‌ బాస్కెట్లు, కాటన్ పరదా, ఇండోనేషియా అధ్యక్షుడికి చెక్కతో చేసిన రాముడి దర్బార్, కెనడా ప్రధానికి సిల్క్ కార్పెట్, సౌతాఫ్రికా ప్రెసిడెంట్‌‌‌‌కి రామాయణంతో కూడిన డోక్రా ఆర్ట్స్, అర్జంటీనా ప్రెసిడెంట్‌‌‌‌కి నంది థీమ్స్‌‌‌‌ను అందజేశారు.