కెమికల్ ఎఫెక్ట్ తో మలేరియా డిపార్ట్ మెంట్ డైలీ లేబర్లకు గాయాలు

కెమికల్ ఎఫెక్ట్ తో మలేరియా డిపార్ట్ మెంట్ డైలీ లేబర్లకు గాయాలు
  • పడుకోలేరు.. కూర్చోలేరు
  •  రెడ్‌‌ జోన్లలో ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలు
  •  కరోనా కట్టడి కిట్లు లేవు.. ట్రీట్‌‌మెంట్‌‌ లేదు
  •  గ్రేటర్‌‌ వరంగల్‌లో దారుణం

గ్రేటర్‌ ‌వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అర్బన్ మలేరియా డిపార్ట్ మెంట్ డైలీ వైజ్‌ లేబర్స్. ఏమైనా అగ్ని ప్రమాదం జరిగిందా.? ఒళ్లు, ఇతర శరీర భాగాలు అలా కాలిపోయాయేంటి అనుకుంటున్నారా .? అవయవాలు కాలింది నిజమే కాని ఫైర్‌ ‌యాక్సిడెంట్‌లో కాదు. కరోనా డ్యూటీల్లో.. విధుల్లో భాగంగా వారు ధరించడానికి పూర్తిస్థాయి కిట్లు లేకపోవ డంతో కెమికల్‌ మీద పడి పాపం.. వీపులు కాలి పోయాయి. పొద్దస్తమానం పని చేసి ఇంటికొచ్చాక కాసేపు కూర్చోలేని, పడుకోలేని దుస్థితి వారిది. పుండ్లు అవుతున్నాయి. మెరుగైన ట్రీట్‌మెంట్‌ చేయించుకుందామంటే వచ్చే జీతం డాక్టర్లు ఇచ్చే మందులు, అయింట్‌మెంట్లకు కూడా చాలవనే బాధ. ఇప్పటికే 10 నుంచి 15 మందికి వీపులు, నడుము, భుజాలు, పిరుదులపై తీవ్ర గాయాలయ్యాయి. అయినా జీడబ్ల్యూఎంసీలో వారి బాధను పట్టించుకునే నాథుడే కనిపించట్లేదు.

కరోనా డ్యూటీలతో.. ఒళ్లుకాలినయ్

మొన్నటి వరకు దోమల నివారణ చర్యల్లో పనిచేసిన మలేరియా విభాగంలోని సిబ్బందికి అదనంగా కరోనా డ్యూటీలు వేశారు. తెల్లారక ముందే స్ప్రే కొట్టే పంపులు ఇచ్చి రెడ్‌ జోన్లకు పంపారు. సిటీలో వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉండటంతో వీరితో గంటల కొద్ది హైపోక్లోరైడ్‌ వంటి పవర్‌‌ఫుల్‌ కెమికల్స్ స్ప్రే చేయించారు. అదే సమయంలో కావాల్సిన కిట్లు, పరికరాలు ఇవ్వలేదు. పంపులు కారి, పైపులు పగిలి కెమికల్‌ సిబ్బందికి అంటుకుని పలువురి భుజాలు, వీపు, నడుము, పిరుదుల వద్ద.. నిప్పుతో కాల్చినట్లుగా తీవ్ర గాయాలయ్యాయి. ఇదే వి షయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా.. వారు పెద్దగా స్పందించకపోవడంతో సమస్య తీవ్రత రోజురోజుకూ పెరుగుతుతోంది. డివిజన్లలో పిచికారీ చేస్తూ.. కెమికల్‌ కొడుతూ నడిచే క్రమంలో ఇద్దరు, ముగ్గురు సిబ్బంది కాళ్లు విరగ్గొంటుకున్నారు.

 బెటర్ ట్రీట్‌మెంట్‌ అడగొద్దు ..

కరోనా, మలేరియా డ్యూటీల్లో భాగంగా వీరంతా తీవ్ర గాయాలపాలైనా డైలీ వైజ్‌ లేబర్స్ కావడంతో ఆఫీసర్లు పట్టిం చుకోవడంలేదు. ట్రీట్‌మెంట్‌ గురించి అడిగితే.. ఎంజీఎంలో చూపించుకోండనే సలహాలు వినాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ‘కావాలంటే సెలవు తీస్కో.. జీతం మాత్రం ఇవ్వలేమనే’.. ఆన్సర్‌ ‌వస్తోందని వాపోతున్నారు. ట్రీట్మెంట్కోసం ప్రైవేట్ డాకర్ల వద్దకు వెళితే రూ.వేలల్లో బిల్లు అవుతుందనే భయంతో.. చేసేదే మిలేక నొప్పులతోనే వారు డ్యూటీల్లో గొడ్డు చాకిరి చేస్తున్నారు. తమను రెగ్యులర్‌ ‌ఎంప్లాయీస్‌గా గుర్తిస్తారనే ఆశతోనే ఏండ్లతరబడి ప్రాణాలు ఫణం గాపెట్టి పనిచేస్తున్నామని, తమ సేవలను సర్కారు గుర్తించాలని వీరంతా కోరుతున్నారు.

తొమ్మిదేండ్లుగా 90 మంది బండ చాకిరి

గ్రేటర్‌‌ వరంగల్‌ అర్బన్ మలేరియా విభాగంలో దోమల నివారణ కోసం ప్రత్యేక టీం ఉంది. 90 మంది కార్మికులు తొమ్మిదేండ్లుగా డెయిలీ వైజ్ ఎంప్లాయీస్ గా పని చేస్తున్నారు. కాలనీల్లో దోమలు పెరగకుండా వాహనాలతో ఫాగింగ్‌ చేయడం, నిల్వ నీరుండే కాలువల్లో ఆయిల్‌ బాల్స్ వేయడం, పంపులతో స్ప్రే చేయడానికి తోడు జనాలకు అవగాహన కల్పిస్తారు. ఆఫీసర్లు అవసరం మేరకు శానిటేషన్‌ వర్క్స్ సైతం చేయిస్తున్నారు. కాగా, పని చేసిన రోజును బట్టి నిన్నమొన్నటి వరకు రోజుకు రూ. 213 జీతం. ఆదివారాలు, రెండో శనివారాలు, పండుగలు పోతే.. 20 రోజులే పని దినాలు. అంటే నెలకు రూ.4,500 కంటే తక్కువ. ఈ మధ్యనే రోజువారీ జీతాన్ని రూ.325కు పెంచినా.. మూడు నెలలుగా రానే లేదు. ఉద్యోగ భద్రత లేదు. పీఎఫ్, గ్రాట్యూటీ లేదు. కనీసం ఏమైనా అయితే వారి ప్రాణాలకు ఇన్సూరెన్స్ కూడా లేదు. అయినా ఒకటి కాదు.. రెండు కాదు తొమ్మిదేండ్లుగా చాలిచాలని వేతనాలతో బండ చాకిరి చేస్తున్నారు. ఏదో రోజు తమకు రెగ్యు లర్ కాకుండా పోతుందా అనే ఆశతో ఏ పని చెబితే.. ఆ పని చేసుకుంటూ వస్తున్నారు.