ఇంటర్​లో ఇక తప్పులుండవ్: గ్లోబరీనా లేదు సీజీజీకే బాధ్యతలు

ఇంటర్​లో ఇక తప్పులుండవ్: గ్లోబరీనా లేదు సీజీజీకే బాధ్యతలు

గ్లోబరీనా లేదు సీజీజీకే బాధ్యతలు: బోర్డు కార్యదర్శి

హైదరాబాద్, వెలుగు: ఇంటర్​ అడ్మిషన్లు, పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, స్టూడెంట్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ​చెప్పారు. అడ్మిషన్​ ప్రక్రియ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఈసారి సెంటర్​ఫర్ గుడ్​గవర్నెన్స్(సీజీజీ)కి అప్పగించినట్లు చెప్పారు. మంగళవారం జలీల్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో పరీక్షలకు ముందు, తర్వాత చేయాల్సిన ప్రక్రియలో పొరపాట్లు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలు చేస్తున్నామని చెప్పారు. సొంత సాఫ్ట్ వేర్ తో పాటు టెక్నికల్​కమిటీని నియమించినట్లు చెప్పారు. స్టూడెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే తమ ముందున్న బాధ్యతని, గ్లోబరీనా గురించి మాట్లాడేందుకు ఏమీలేదని ఆయన స్పష్టంచేశారు.

ఈసారి 9 లక్షలకు పైగా..

ఈ ఏడాది ఫస్ట్, సెకండియర్​స్టూడెంట్లు మొత్తం కలిపి 9,62,699 మంది పరీక్షలు రాయబోతున్నారని జలీల్​చెప్పారు.  ప్రాక్టికల్స్​లో జంబ్లింగ్​పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, విద్యామంత్రితో చర్చించాక క్లారిటీ వస్తుందన్నారు. స్టూడెంట్లు లేని కాలేజీల్లోని ఎయిడెడ్​ లెక్చరర్లను ఇతర కాలేజీలకు పంపించామన్నారు. అనుబంధ గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ కాలేజీలు ఇచ్చిన లిస్టులలోని లెక్చరర్లే పేపర్లు దిద్దేందుకు రావాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష ఫీజు కన్నా ఎక్కువ మొత్తం వసూలు చేసిన కాలేజీలు, దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహించిన కాలేజీలకు  ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు.