V6 News

గ్రేగ్ చాపెల్ ఏపీసోడ్ పై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్

గ్రేగ్ చాపెల్ ఏపీసోడ్ పై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్

ముంబై : బౌలింగ్‌‌లో పదును తగ్గింది. మునుపటి స్వింగ్‌‌ లేదు. ఆటపై ఆసక్తి పోయిందనుకుంటా. గ్రెగ్‌‌ చాపెల్‌‌ వల్లే ఇలా తయారయ్యాడు.. స్వింగ్‌‌ సుల్తాన్‌‌గా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్‌‌ పఠాన్‌‌ కెరీర్‌‌ పరంగా కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిన విమర్శలివి. శనివారం ఆటకు రిటైర్మెంట్‌‌ ప్రకటించిన ఈ టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ తనపై వచ్చిన విమర్శలన్నీ ఊహాగానాలేనని చెప్పాడు. ఇప్పటికీ బాల్‌‌ను స్వింగ్‌‌ చేయగలనన్న ఇర్ఫాన్‌‌.. తన కెరీర్‌‌ విషయంలో గ్రెగ్‌‌ చాపెల్‌‌పై వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.  ఇండియాలో చాలా మంది క్రికెటర్లు 27-–28 ఏళ్ల వయస్సులో ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌ మొదలుపెడతారు. కానీ నేను ఆ వయసులో  చివరి మ్యాచ్‌‌ ఆడా అంటూ పఠాన్‌‌(35) ఆటకు గుడ్‌‌బై చెప్పాడు. అయితే తన కెరీర్‌‌ విషయంలో వచ్చిన ఊహాగానాలతో పాటు పలు అంశాలపై ఇర్ఫాన్‌‌ స్పందించాడు. అవి అతని మాటల్లోనే.. నా కెరీర్‌‌ డౌన్‌‌ఫాల్‌‌ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. గ్రెగ్‌‌ చాపెల్‌‌ పాత్రపై ఎక్కువ చర్చ జరిగింది. అలాంటి ఊహాజనిత కథనాలపై మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. అందరూ కలిసి ఇర్ఫాన్‌‌ బాల్‌‌ను స్వింగ్‌‌ చేయలేకపోతున్నాడనే స్థాయికి పరిస్థితిని తెచ్చారు. ఓ బౌలర్‌‌ తన వాటా పది ఓవర్లలో ఒకే విధంగా స్వింగ్‌‌ రాబట్టలేడన్న విషయాన్ని జనాలు ముందు అర్థం చేసుకోవాలి. ప్రజలు నా పెర్ఫామెన్స్‌‌పై చర్చించేవారు. కానీ జట్టులో నా పని వేరు. ఫస్ట్‌‌ చేంజ్‌‌ బౌలర్‌‌ బాధ్యతను నాకు అప్పజెప్పారు. నేను ఆ పనే చేసేవాడిని. అయితే 2008 శ్రీలంకలో బాగా ఆడి మ్యాచ్‌‌ గెలిపించిన తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన సంగతి నాకింకా  గుర్తుంది.  ఎలాంటి కారణం లేకుండా జట్టు నుంచి తప్పిస్తే ఎవరిని ప్రశ్నించాలి. 2008 ఐపీఎల్‌‌ తర్వాత పఠాన్‌‌ అన్ని ఫార్మాట్‌‌లకు పని కొస్తాడా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ  నేను మూడు ఫార్మాట్‌‌లు ఆడాలని అనుకున్నా.

గాయాల వల్లే..

2009–10 మధ్యలో వెన్ను భాగంలో గాయమైంది. గాయం పరిస్థితి తెలుసుకోవడానికి అప్పట్లో ముంబై, అహ్మదాబాద్‌‌, బెంగళూరుకు తిరుగుతూ చాలా అవస్థలు పడ్డా. శరీరానికి మంచిది కాదని తెలిసినా కొన్ని స్కాన్స్‌‌ చేయించుకున్నా. గాయం పరిస్థితి ఖచ్చితంగా తెలుసుకోవడానికి రకరకాల స్కాన్స్‌‌ చేయించుకున్నా. అసలు నాకు నొప్పి ఎందుకు వస్తుందో కనిపెట్టడానికి అప్పట్లో సరైన స్కానింగ్‌‌ పరికరాలు మనకు అందుబాటులో లేవు. అది కూడా నాకు సమస్యగా మారింది. బ్యాక్‌‌ పెయిన్‌‌ వల్ల దాదాపు రెండేళ్లు నరకం చూశా. అయినా రంజీలు ఆడడం ఆపలేదు. అయితే ఫిట్‌‌గా లేకపోవడం వల్ల బౌలింగ్‌‌ స్పీడ్‌‌ క్రమంగా తగ్గింది. అయినా నేను పోరాడా. ఏం చేసినా ఆట మీద ప్రేమతోనే చేశా. రంజీల్లో బరోడా కెప్టెన్‌‌గా ఉన్నా. ఐపీఎల్‌‌లో సెటిలయ్యా. వన్డే టీమ్‌‌ల్లో స్థిరపడిపోయా.అలాంటి టైమ్‌‌లో  ఆట మీద ఆసక్తి లేకపోతే పదిలో తొమ్మిది రోజులు(చాంపియన్స్‌‌ లీగ్‌‌, ఇంగ్లండ్‌‌తో త్రీడే మ్యాచ్‌‌, కర్నాటకతో రంజీ)  క్రికెట్‌‌ ఎలా ఆడతా. ఆ పది రోజుల్లో 25 ఓవర్లు బౌలింగ్‌‌ చేశా.. ఓ సెంచరీ కూడా చేశా. టెస్ట్‌‌ క్రికెట్‌‌లోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆశ, దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే తపనతోనే అన్నీ చేశా.

దాదా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌‌తోనే..

నేను టీమ్‌‌లోకి వచ్చేసరికే ఆస్ట్రేలియాలో కొత్త బాల్‌‌తో నేను ఏదో చేయగలనని గంగూలీ నమ్మాడు. దాదా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌‌ వల్లే నా కెరీర్‌‌ మొదలైంది. నా సామర్థ్యాన్ని వాడుకోవడంలో కెప్టెన్‌‌గా ద్రవిడ్‌‌ ఓ అడుగు ముందున్నాడు. కొత్త బాల్‌‌తో బౌలింగ్‌‌ చేయించడంతో పాటు బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో ద్రవిడ్‌‌ నాకు ప్రమోషన్‌‌ ఇచ్చాడు. కుంబ్లే సహచరుడుగా ఉండడం నేను చేసుకున్న అదృష్టం. సచిన్‌‌ అయితే ఎప్పుడూ మంచి సలహాలు ఇచ్చేవాడు. అతనో గొప్ప నాయకుడు. కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో దిట్ట. మంకీగేట్‌‌ ఎపిసోడ్‌‌ అప్పుడు ఆ విషయం నాకు అర్థమైంది.