ప్రజ్ఞాన్ మూన్ వాక్.. చంద్రుడిపై కొద్దిదూరం ప్రయాణించిన రోవర్

ప్రజ్ఞాన్ మూన్ వాక్.. చంద్రుడిపై కొద్దిదూరం ప్రయాణించిన రోవర్
  • ల్యాండర్, రోవర్ హెల్దీగా ఉన్నాయన్న ఇస్రో చీఫ్  
  • నీరు, ఖనిజాల డేటా కోసమే సౌత్ పోల్​పై ఫోకస్ పెట్టామని వెల్లడి

బెంగళూరు: ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్ మూన్ వాక్ షురూ చేసింది. చంద్రుడిపై బుధవారం సాయంత్రం విక్రమ్ ల్యాండర్ తో పాటు దిగిన రోవర్ రాత్రి పది గంటలకు బయటకు వచ్చింది. గురువారం చంద్రుడిపై రోవర్ కొద్ది దూరం ప్రయాణించిందని, రెండు ఫొటోలు కూడా పంపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. ల్యాండర్ తో పాటు రోవర్14 రోజుల పాటు ఎక్స్​పెరిమెంట్లు చేసి వాటి ఫలితాలను భూమికి చేరవేయనున్నాయని తెలిపింది. రోవర్ తీసిన ఫొటోలను త్వరలోనే రిలీజ్ చేస్తామని ఇస్రో ప్రకటించింది. రోవర్, ల్యాండర్ హెల్దీగా ఉన్నాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. ‘భవిష్యత్తులో చంద్రుడిపై జీవనం సాగించాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి.

అలాంటప్పుడు అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. సౌత్ పోల్​లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అక్కడ నీరు, ఖనిజాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. దక్షిణ ధ్రువం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే.. మేము సౌత్ పోల్ ను ఎంచుకున్నాం. దక్షిణ ధ్రువంపై ఆవాసాలు ఏర్పాటు చేసుకోగలమా.. లేదా.. అనేది మన  పరిశోధనలతో తేలిపోతుంది”అని ఇస్రో చీఫ్ వివరించారు. ఇక సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య ఎల్1’ మిషన్ ను సెప్టెంబర్​లో చేపడతామని చెప్పారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ పని కూడా స్పీడ్ గా నడుస్తోందన్నారు. 

ఇస్రో టీమ్​కు సిద్ధరామయ్య సన్మానం 

చంద్రయాన్ 3 సైంటిస్టుల టీమ్​తో కర్నాటక సీఎం సిద్ధరామయ్య గురువారం భేటీ అయ్యారు. ల్యాండర్‌ను విజయవంతంగా దింపినందుకు వారిని అభినందించారు. తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్​ను సంప్రదాయబద్ధంగా తలపాగా పెట్టి మెమొంటో, శాలువాతో సన్మానించారు.  

ఆర్థిక లక్ష్యాల వైపు ఇండియా పరుగులు

చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావడంతో ఇండియా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు. 2025 నాటికి స్పేస్ ఎకనామిక్ సెక్టార్ విలువ 13 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా నిలిచే కల కూడా సాకారం అవుతుందని చెబుతున్నారు.  

ఒడిశాలో పిల్లలకు చంద్రయాన్ పేరు 

ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో బుధవారం పుట్టిన పిల్లలకు చంద్రయాన్​అని పేరు పెట్టారు. ఇస్రో  మూన్ మిషన్ ​సక్సెస్ కావడంతో పిల్లల తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రపడ జిల్లా ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం ఒక ఆడపిల్ల, నలుగురు మగపిల్లలు పుట్టారు. చంద్రయాన్​3 చంద్రుడిపైకి విజయవంతంగా ల్యాండ్​ అయిన సమయంలోనే తమకు పిల్లలు పుట్టడంతో ఆనందం రెట్టింపు అయిందని పేరెంట్స్ తెలిపారు. అయితే, సంప్రదాయం ప్రకారం.. శిశువు పుట్టిన 21వ రోజున పూజ చేసి పేరు పెడతామన్నారు. చంద్ర, లూనా పేర్లు కూడా అనుకుంటున్నామని అయితే చంద్రయాన్​ అనే పేరే స్టైలిష్ గా ఉందని ఇద్దరు దంపతులు చెప్పారు.

 గూగుల్ స్పెషల్ డూడుల్

చంద్రయాన్ 3 సక్సెస్ అయిన సందర్భంగా గూగుల్ సెర్చ్ ఇంజన్ తన హోం పేజీలో గురువారం స్పెషల్ యానిమేటెడ్ డూడుల్ తో సెలబ్రేట్ చేసింది. చారిత్రాత్మక ఫీట్‌ను కొనియాడుతూ గ్రాఫికల్ వీడియో రూపంలో డూడుల్​ను ప్రదర్శించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి చుట్టూ తిరిగి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్‌ అవడం.. ఆ తర్వాత ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడిపై నడవడం.. ఇదంతా చూస్తూ చంద్రుడు హర్షం వ్యక్తం చేసినట్లుగా యానిమేషన్ లో చూపింది.