ఏడాదికోసారి వచ్చే పనసకాయ సీజన్ అంతా సందడి చేస్తుంది. చాలావరకు పనస తొనలు తిని గింజలు పడేస్తారు. కానీ, గింజలు హెల్త్ కి చాలా మంచివి, అది సరే వాటినెలా తినాలి? అంటున్నారా! మీ కోసమే పనస తొనలు, గింజలతో చేసుకునే వెరైటీలు... ఒకసారి ట్రై చేయండి.
పనస గింజల పకోడి తయారీకి కావాల్సినవి
- పనస గింజలు (ఉడికించినవి) – పది
- ఉల్లిగడ్డ -ఒకటి
- జీలకర్ర - అర టీస్పూన్
- పచ్చిమిర్చి- రెండు
- కరివేపాకు, కొత్తిమీర-కొద్దిగా
- శనగపిండి - ఒక కప్పు
- బియ్యప్పిండి- అరకప్పు
- ఉప్పు, కారం-ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
- బేకింగ్ సోడా - పావు టీస్పూన్
- నూనె - సరిపడా
పసన గింజల పకోడి తయారీ విధానం
పొట్టు తీసి, ఉడకబెట్టిన పనస గింజల్ని మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ తరుగు, శనగపిండి. పనస గింజల మిశ్రమం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, బియ్యప్పిండి, కారం, ఉప్పు వేసి కలపాలి. కొన్ని నీళ్లు పోసి పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండేలా కలపాలి. కొంచెం కొంచెంగా తీసుకుని వేడి వేడి నూనెలో వేసి వేగించాలి. ఇక అంతే నోరూరించే వెరైటీ పకోడీలు రడీ..!
పనస గింజల చట్నీ తయారీకి కావాల్సినవి
- పనస గింజల తరుగు-ఒక కప్పు
- కొబ్బరి తురుము -ఒక కప్పు
- ఎండు మిర్చి పన్నెండు
- నూనె - ఒక టేబుల్ స్పూన్
- ఉల్లిగడ్డ తరుగు-రెండు టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి –ఆరు
- కొబ్బరి తురుము –ఒక కప్పు
- చింతపండు -ఒక టీస్పూన్
- నీళ్లు –సరిపడా
పనస గింజల చట్నీ తయారీ విధానం
పనస గింజలు, ఎండు మిర్చి, వేరువేరుగా నూనె లేకుండా వేగించాలి. పాన్లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు, వెల్లుల్లి వేసి వేగించాలి. మిక్సీజార్ లో పనస గింజలు, ఎండు మిర్చి, ఉల్లిగడ్డ తరుగు, అల్లం, వెల్లుల్లి తరుగు, కొబ్బరి తురుము, చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. నీళ్లు పోసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి.
పనస గింజలతో కూర తయారీకి కావాల్సినవి
- పనస గింజలు - ఒక కప్పు
- ఉప్పు - సరిపడా
- ఆవాలు, జీలకర్ర -ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
- టొమాటో, ఉల్లిగడ్డ తరుగు - ఒక్కోటి అరకప్పు చొప్పున
- కరివేపాకు- కొద్దిగా
- కారం - అర టీస్పూన్
- ధనియాల పొడి - పావు టీస్పూన్
- నూనె - రెండు టేబుల్ స్పూన్లు
పనస గింజల కూర తయారీ విధానం
పనస గింజల్ని వేగించి, పొట్టు తీయాలి. ఒక గిన్నెలో నీళ్లు కాగబెట్టి, అందులో ఉప్పు వేసి పనస గింజల్ని ఉడికించాలి. పాన్లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి వేగించాలి. కాస్త వేగాక, పసుపు, కారం, ధనియాల పొడి, టొమాటో తరుగు వేసి వేగించాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించిన పనసగింజల్ని చిదిమి అందులో వేయాలి. మరి కాసేపు వేగిస్తే పనస గింజల కూర రెడీ.
