జగదీశ్ రెడ్డి అబద్దాల కోరు: దాసోజు శ్రవణ్

జగదీశ్ రెడ్డి అబద్దాల కోరు: దాసోజు శ్రవణ్

796 మంది విద్యార్థుల మొమోల్లోనే తప్పులున్నాయని మంత్రి జగదీశ్‌‌రెడ్డి చెబుతున్నారు. ఇంటర్‌‌ బోర్డేమో 6,415 మంది మార్కుల షీట్లు సరి చేశామంటోంది. మంత్రి జగమెరిగిన అబద్ధాలకోరని దీన్ని బట్టే తెలుస్తోంది’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ శ్రవణ్‌‌ విమర్శించారు. రెండింటిలో ఏది నిజమో ప్రభుత్వమే చెప్పాలన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్‌‌ చేయాలని డిమాండ్‌‌ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌తో కలిసి దాసోజు విలేకరులతో మాట్లాడారు. ఇంటర్‌‌ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ 110 పేజీల నివేదికనిస్తే 10 పేజీలనే బయటపెట్టడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ముగ్గురు సభ్యులు సంతకాలు పెట్టిన నివేదికను దాచిపెట్టి దొంగ నివేదికను బయటపెట్టారని ఆరోపించారు. ఎవరిని రక్షించడానికి నివేదికను దాచిపెడుతున్నారని నిలదీశారు. గ్లోబరెనాతో ఇంటర్‌‌ బోర్డు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని చెప్పారని, ఒప్పందం లేకే న్యాయపర చర్యలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. విద్యార్థుల చావుకు కారణమైన ఈ వ్యవహారంపై జ్యుడీషియల్‌‌ ఎంక్వైరీ జరగాలని డిమాండ్‌‌ చేశారు. విద్యార్థుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ఆన్‌‌లైన్‌‌ వెబ్‌‌సైట్‌‌, ఐవీఆర్‌‌లను వెంటనే ప్రారంభించాలన్నారు. అన్ని రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ సర్కారు అతి తక్కువగా విద్యకు ఖర్చు పెడుతోందని విశ్వేశ్వర్‌‌రెడ్డి అన్నారు. గురుకుల పాఠశాలపై ఖర్చు శాంపిల్ మాత్రమేనని చెప్పారు.