ఉత్తరప్రదేశ్‌లో ఎన్ కౌంటర్.. అతిక్ అహ్మద్ కొడుకుతో పాటు ఇద్దరు హతం

ఉత్తరప్రదేశ్‌లో ఎన్ కౌంటర్..  అతిక్ అహ్మద్ కొడుకుతో పాటు ఇద్దరు హతం

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ తో పాటు మరొకరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్ లో జరిగిన ఉమేష్ పాల్ హత్యలో అసద్ అహ్మద్, గులామ్‌లు వాంటెడ్ క్రిమినల్స్ గా ఉన్నారు.  ఆ కేసులో అస‌ద్‌పై 5 ల‌క్షల రివార్డు కూడా ఉంది. తాజాగా జరిగిన పోలీసుల కాల్పుల్లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం వారిని కాల్చి చంపింది. వారి నుంచి అధునాతన ఆయుధాలు, సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ఉమేష్ పాల్ అనే న్యాయవాది సాక్షిగా ఉన్నారు. ఫిబ్రవరి 24న, ప్రయాగ్‌రాజ్‌లోని తన ఇంటి వెలుపల పగటిపూట జరిగిన ఓ దాడిలో అతన్ని కాల్చి చంపారు. ఆ దాడిలో అతని భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

అతిక్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ. కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు రావటంతో.. ఆ కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను సుప్రీంకోర్టు ఆదేశాలతో గుజరాత్ జైలుకు తరలించారు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్న అతిక్ అహ్మద్.. ఇటీవల కాలంలో.. అంటే రెండు నెలలుగా కోర్టు విచారణ కోసం ఉత్తరప్రదేశ్ వస్తూ ఉన్నారు. తరచూ వార్తల్లో ఉంటున్నారు. 

ఈ క్రమంలోనే అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ కావటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.