అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టమంటున్నరు..నిజమేనని ఒప్పుకున్న నవ్య భర్త

అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టమంటున్నరు..నిజమేనని ఒప్పుకున్న నవ్య భర్త
  • ఎమ్మెల్యే రాజయ్య, పీఏ, ఎంపీపీ, భర్తపై సర్పంచ్​ నవ్య ఫిర్యాదు 
  • తన భర్తకు డబ్బులిచ్చి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపణ
  • రూ.7 లక్షలు ఇచ్చారన్న ప్రవీణ్ 

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ శ్రీనివాస్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవితారెడ్డి, భర్త ప్రవీణ్ పై నవ్య కంప్లయింట్​ఇచ్చారు. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మూడు నెలల కింద నవ్య ఆరోపణలు చేయగా, సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. రాజీ పడే సమయంలోనే ఎమ్మెల్యే గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఆ నిధులు ఇవ్వకపోగా.. తనకు రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నవ్య ఆరోపించారు. 

ఏమని ఫిర్యాదు చేశారంటే..  

తన భర్త కుర్సపెల్లి ప్రవీణ్​కుమార్, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్​ తన గ్రామానికి నిధులు ఇస్తామని తనను హనుమకొండకు పిలిపించుకుని, రెండు అగ్రిమెంట్​పేపర్లపై సంతకాలు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని సర్పంచ్​ నవ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసినట్టుగా, భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేసినా తానే బాధ్యురాలినని ఒప్పుకుంటూ సంతకం పెట్టాల్సిందిగా బలవంత పెట్టారన్నారు. దాంతో పాటు రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నట్లుగా, మళ్లీ ఎప్పుడడిగితే అప్పుడు ఇచ్చేలా స్టాంప్​పేపర్​ రెడీ చేసి తీసుకువచ్చి సంతకం పెట్టమని ఒత్తిడి చేశారన్నారు. 10 రోజుల నుంచి తన భర్త ప్రవీణ్ ​మరో అగ్రిమెంట్ పేపర్​ తీసుకొచ్చి సంతకం పెట్టాల్సిందిగా వేధింపులకు గురి చేస్తున్నాడని, సంతకం పెడితేనే  గ్రామానికి ఒప్పుకొన్న రూ.25 లక్షలు ఇస్తామంటున్నారని ఒత్తిడి చేస్తున్నారన్నారు. 

వీరితో పాటు ధర్మసాగర్​ ఎంపీపీ నిమ్మ కవిత ఎమ్మెల్యేకు మధ్యవర్తిగా వ్యవహరించి తనను ప్రలోభాలకు గురి చేసిందని, మానసికంగానూ ఇబ్బంది పెట్టిందన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ కవిత.. తన భర్త ప్రవీణ్​కు రూ.20 లక్షలు ఇస్తానని ఆశచూపి తనతో సంతకం చేయించడానికి ప్లాన్​వేశారన్నారు. తనను ఒప్పంద పత్రాలపై సంతకం పెట్టాల్సిందిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆయన పీఏ శ్రీనివాస్​, ఎంపీపీ కవిత, తన భర్త ప్రవీణ్ వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిపై  విచారణ జరిపించి బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

నాకు డబ్బులిచ్చారు...అందుకే...

తనకు రూ.7 లక్షలు ఇచ్చారని సర్పంచ్​ నవ్య భర్త ప్రవీణ్​ కుమార్​ ఒప్పుకున్నాడు. అందుకే తన భార్య నవ్యపై తాను ఒత్తిడి చేశానని చెప్పాడు. నవ్యకు రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు, కావాలనే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసినట్టు బాండ్ పేపర్ రాయించి సంతకం పెట్టించమని తనకు చెప్పారన్నాడు. గతంలో నవ్య ఆరోపణలు చేసినప్పుడు  ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని కాళ్లావేళ్లాపడితే రాజీకి ఒప్పుకున్నామన్నాడు. కానీ, ఇప్పటివరకు పంచాయతీకి ఇస్తానన్న నిధులు ఇవ్వలేదన్నారు.