జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు

జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు

జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెపై కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. అబెకు వైద్యులు అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు.   షింజో అబెపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో సుదీర్ఘ కాలం జపాన్ ప్రధానిగా సేవలు అందించిన షింబో అబెపై దాడికి తెగబడిన ఆ వ్యక్తి ఎవరు ? అనే దానిపై కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.  

రెండుసార్లు తుపాకీ పేలింది.. 

నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున మాజీ ప్రధాని షింబో అబె శుక్రవారం ఉదయం ప్రచారం చేశారు.  ఈక్రమంలో ఆయన యమతో సైదైజీ రైల్వే స్టేషన్  వద్ద  ఏర్పాటుచేసిన వేదికపై నిలబడి ప్రసంగిస్తుండగా .. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.  రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం వచ్చింది.  పరిసర ప్రాంతాల్లో గాలించిన అబె భద్రతా సిబ్బంది..  నాటు తుపాకీ పట్టుకున్న 41 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని నారా నగరానికి చెందిన టెట్సుయా యమగామిగా గుర్తించినట్లు జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. యమగామి 2002 నుంచి 2005 సంవత్సరం వరకు జపాన్ నౌకాదళంలోని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేశాడని ప్రస్తావించారు.  టెట్సుయా యమగామిని విచారణ నిమిత్తం నారా నిషి పోలీసు స్టేషన్ కు తరలించారు.  పోలీసుల విచారణలో అతడు నివ్వెరపరిచే విషయాలు చెప్పాడంటూ ఓ జపాన్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. గతంలో ప్రధానిగా షింజో అబె అందించిన పాలన నచ్చకే .. ఆయనపై కాల్పులు జరిపానని  పోలీసులతో యమగామి చెప్పాడని పేర్కొంది.