రాయ్పూర్లో యూపీఏ ఎమ్మెల్యేల మకాం

రాయ్పూర్లో యూపీఏ ఎమ్మెల్యేల మకాం
  • జార్ఖండ్లో పతాక స్థాయికి రాజకీయ సంక్షోభం
  •  భారీ భద్రత నడుమ రిసార్టులో ఎమ్మెల్యేలు
  • రేపు సాయంత్రం 4 గంటలకు జార్ఖండ్ మంత్రివర్గ సమావేశం

జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధికార యూపీఏ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 32 మంది ఎమ్మెల్యేలను ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ కు తరలించింది. ఎమ్మెల్యేలందరూ జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ నివాసం నుంచి రెండు బస్సుల్లో రాంచీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. సీఎం సోరెన్ మినహా ఇతర ఎమ్మెల్యేలు చార్టెడ్ విమానంలో రాంచీ నుంచి రాయ్ పూర్ వెళ్లారు. అక్కడ నవ రాయ్ పూర్ లోని మేఫెయిర్ రిసార్ట్ కు చేరారు. 
ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ చుట్టూ పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 కాగా, అధికార యూపీఏకు 49 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే అవకాశముందని యూపీఏ అనుమానిస్తోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అయినా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  రాజ్ భవన్ మౌనం వహిస్తోందని యూపీఏ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకుని..రాజకీయ అనిశ్చితి తొలగించాలని సీఎం సోరెన్ కోరుతున్నారు.ఈ నేపథ్యంలో జార్ఖండ్ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 1న సాయంత్రం 4 గంటలకు జరగనుంది.