కాంగ్రెస్‌‌ను విమర్శించే వాళ్లు ఇతర పార్టీల్లో చేరాలి

కాంగ్రెస్‌‌ను విమర్శించే వాళ్లు ఇతర పార్టీల్లో చేరాలి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌ను విమర్శించే నాయకులు ఇతర పార్టీల్లో చేరాలని లేదా సొంత పార్టీ పెట్టుకోవాలని హస్తం పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి అన్నారు. బిహార్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ప్రజలు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌‌ను భావించడం లేదని సీనియర్ నేత కపిల్ సిబాల్ రీసెంట్‌‌గా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు. సిబాల్ కామెంట్స్‌‌పై అధిర్ రంజన్ చౌధురి కూడా ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ, పార్టీ ప్రెసిడెంట్ సోనియాకు దగ్గరగా ఉండే సిబాల్ లాంటి నేతలు సమస్యలను అధిష్టానానికి తెలియజేయాలన్నారు.

‘కాంగ్రెస్ పార్టీ తమకు సరైనది కాదని ఎవరైనా భావిస్తే.. అలాంటి వాళ్లు సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చు. తమ ఆసక్తులను బట్టి ఇతర పార్టీల్లోనూ జాయిన్ అవ్వొచ్చు. కానీ కాంగ్రెస్ విశ్వసనీయతను దెబ్బతీసే కార్యకలాపాలకు మాత్రం ఎవరూ పాల్పడకూడదు. కొందరు సీనియర్లకు గాంధీ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే దాన్ని వాళ్లు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలి’ అని చౌధురి పేర్కొన్నారు.