నవంబర్ రెండో వారంలో కాళేశ్వరం రిపేర్లు..2027 వర్షాకాలం నాటికి పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

నవంబర్ రెండో వారంలో కాళేశ్వరం రిపేర్లు..2027 వర్షాకాలం నాటికి పనులు పూర్తి: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
  • మూడు బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు రెడీ చేసినం​
  • అక్టోబర్ 5న సీడబ్ల్యూసీ టెక్నికల్​ ఓవర్​ సైట్​కమిటీకి ఇస్తం
  • నాణ్యతలో రాజీపడం.. కేంద్ర సంస్థలు ఓకే చెప్పాకే వినియోగం
  • కాళేశ్వరం బ్యారేజీలపై మంత్రి కీలక రివ్యూ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ (రీహాబిలిటేషన్) పనులను నవంబర్  రెండో వారంలో ప్రారంభిస్తామని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 2027 వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులన్నింటినీ పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. శనివారం హైదరాబాద్‌‌  కుందన్​బాగ్​లోని తన ఇంట్లో ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. మూడు బ్యారేజీల భద్రత, కార్యాచరణ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లను ఖరారు చేసిందని వెల్లడించారు.

గతంలో బ్యారేజీల నిర్మాణంలో దొర్లిన లోపాలను సరిదిద్దేలా పటిష్ట ప్రణాళిక రూపొందించామన్నారు. గ్రౌటింగ్ ద్వారా పునాదులను పటిష్టం చేయడం, స్టిల్లింగ్ బేసిన్లను విస్తరించడం, సరికొత్తగా కటాఫ్ వాల్స్ నిర్మించడం వంటి కీలక పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. గతంలో సరిగాలేని ఎనర్జీ డిసిపేషన్ వ్యవస్థను మెరుగుపరచడం, పునాదుల స్థిరత్వాన్ని పెంచడం, అండర్ సీపేజ్ (పునాదుల కింద నీటి ఊట) సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా డిజైన్లు రూపొందించామని వివరించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) లేవనెత్తిన సాంకేతిక అంశాలు, నిపుణుల కమిటీల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా రిపేర్లు చేస్తున్నామని చెప్పారు.

నాణ్యతలో రాజీపడం.. 

బ్యారేజీల నిర్మాణ భద్రత, పనుల నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తాత్కాలిక మరమ్మతుల జోలికి వెళ్లకుండా, దీర్ఘకాలికంగా పటిష్టంగా ఉండే సాంకేతిక పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఆధ్వర్యంలో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌‌డీ) మోడలింగ్ ద్వారా ప్రస్తుతం రీ-డిజైన్ల సమగ్ర పరిశీలన జరుగుతోందని తెలిపారు.

వివిధ వరద ప్రవాహ పరిస్థితుల్లో నీటి ప్రవర్తన, ఎనర్జీ డిసిపేషన్ పనితీరును శాస్త్రీయంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ)కి చెందిన టెక్నికల్ ఓవర్‌‌సైట్ కమిటీకి అక్టోబర్​ 5న డిజైన్లను సమర్పిస్తామని తెలిపారు. నిపుణుల పరిశీలన, సిఫార్సుల మేరకు తుది ఆమోదం తీసుకుంటామని, టెక్నికల్ క్లియరెన్స్ రాగానే పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు కసరత్తులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం ఇప్పటికే కాస్ట్ ఎస్టిమేట్స్, టెండర్ విధివిధానాలను సిద్ధం చేస్తున్నదని, అనుమతులు రాగానే వెంటనే టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

నేషనల్ ఏజెన్సీలు ఓకే చెప్పాకే.. 

పనుల అమలులో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, స్వతంత్ర టెస్టింగ్ విధానాలు, పక్కా టైమ్‌‌లైన్లను అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్డీఎస్ఏ నిబంధనలను నూటికి నూరు శాతం పాటించాలని, డిజైన్ల వ్యాలిడేషన్ నుంచి టెండరింగ్, ఎగ్జిక్యూషన్, తుది భద్రతా సర్టిఫికేషన్ వరకు ప్రతి దశనూ పారదర్శకంగా డాక్యుమెంట్ చేయాలన్నారు.

బ్యారేజీల పునరుద్ధరణ పనులు పూర్తయి, జాతీయ భద్రతా సంస్థల నుంచి సమగ్ర రక్షణ క్లియరెన్సులు పొందిన తర్వాతే మూడు బ్యారేజీలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామని మంత్రి తేల్చిచెప్పారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీ శ్రీధర్, ఈఎన్​సీ జనరల్ రమేశ్​ బాబు, టన్నెల్​సెక్రటరీ పరీక్షిత్​ మెహ్రా, జాయింట్​సెక్రటరీ కె. శ్రీనివాస్, ఓ అండ్​ ఎం ఈఎన్​సీ మధుసూదన్, సీడీవో అధికారులు తదితరులు పాల్గొన్నారు.