ఢిల్లీలో 30న ఇండియా కూటమి కీలక భేటీ..ఈసీ, సర్‌‌‌‌‌‌‌‌పై చర్చించనున్న నాయకులు

ఢిల్లీలో 30న ఇండియా కూటమి కీలక భేటీ..ఈసీ, సర్‌‌‌‌‌‌‌‌పై చర్చించనున్న నాయకులు
  • సీసీఐలో జరుగనున్న సమావేశం

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పై తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 30న ఇండియా కూటమి కీలక భేటీ నిర్వహించనుంది. 

ఢిల్లీలోని కాన్‌‌‌‌స్టిట్యూషన్ క్లబ్‌‌‌‌ ఆఫ్​ ఇండియా (సీసీఐ)లో జరగనున్న ఈ సమావేశంలో విపక్ష కూటమికి చెందిన అగ్ర నేతలందరూ హాజరవుతారని సమాచారం. ఈ సమావేశంలో ఎన్నికల సంఘం (ఈసీ) విధానాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై ప్రధానంగా చర్చించనున్నారు. 

సర్ ప్రక్రియలోని అంశాలపై ఈసీలోనే భిన్నాభిప్రాయాలు, విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌పై వస్తున్న ఆరోపణలు, ఈసీ 
నిర్ణయాలపై విపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడే దిశగా కార్యాచరణ రూపొందించనున్నాయి.

ఒక్కటైన రాజకీయ ప్రత్యర్థులు

పశ్చిమ బెంగాల్‌‌‌‌లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఎం ఈ అంశంపై ఒక్కటయ్యాయి. సీఈసీని తొలగించాలంటూ వామపక్షాలు చేసిన డిమాండ్‌‌‌‌కు మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీతో ఫోన్‌‌‌‌లో సంప్రదింపులు జరిపారు. 

మరోవైపు, టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ కూడా లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో టెలిఫోన్‌‌‌‌లో మాట్లాడారు. ఈ అంశంపై సమగ్ర వ్యూహం ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. 

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ను తొలగించాలని, ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో మరోసారి నోటీసు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. సెప్టెంబర్ 30 నాటి విపక్షాల సమావేశం ముగిసిన వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నాయి.