- 4,200 మందికి డ్రగ్స్ స్క్రీనింగ్.. 2,126 మందికి చికిత్స
- అవార్డు అందుకున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జైళ్లశాఖకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్–2026 అవార్డు దక్కింది. రాష్ట్ర జైళ్ల శాఖలో నిర్వహిస్తున్న డీ అడిక్షన్ సెంటర్లు దేశంలోని జైళ్లశాఖల్లో ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఈ మేరకు ఖైదీలను మాదకద్రవ్యాల నుంచి దూరం చేసేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన వినూత్న, పునరావాస డీ-అడిక్షన్ కేంద్రాలను గుర్తిస్తూ స్కోచ్ గ్రూప్ అవార్డులకు ఎంపిక చేసింది.
న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్– ఇండియా ఎకనామిక్ ఫోరంలో ప్రదానం చేశారు. స్కోచ్ వ్యవస్థాపకులు రోహన్ కొచర్, స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచర్ చేతుల మీదుగా తెలంగాణ జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డీజీ డా. సౌమ్య మిశ్రా అవార్డును స్వీకరించారు.
అంతర్జాతీయ వేదికపై జైళ్ల శాఖకు గుర్తింపు ఇలా
జైళ్ల శాఖ సేవలను గుర్తించి స్కోచ్ అవార్డుకు ఎంపిక చేసినందుకు డీజీ సౌమ్యమిశ్రా ఆనందం వ్యక్తం చేశారు. నివృత్తి కార్యక్రమానికి సంబంధించిన ఫలితాలను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్ కరెక్షన్స్ కాన్ఫరెన్స్–2026లో ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన వినూత్న కరెక్షనల్, పునరావాస విధానానికి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించిందని వెల్లడించారు.
నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ కార్యక్రమంలో రాష్ట్ర జైళ్ల శాఖ డీ అడిక్షన్ సెంటర్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 4,200 మంది ఖైదీలకు డ్రగ్ సంబంధించి స్క్రీనింగ్ చేసింది. ఇందులో 2,126 మంది ఖైదీలను మత్తు పదార్థాలకు బానిసలుగా గుర్తించింది. వీరికి స్క్రీనింగ్ నిర్వహించి, కౌన్సెలింగ్, ట్రీట్‌మెంట్ అందించారు. అదేవిధంగా జైలు నుంచి విడుదలైన 300 మంది ఖైదీలకు అవసరమైన సహాయాన్ని అందించారు.
ఈ మేరకు చంచల్‌గూడ, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లతో పాటు చంచల్‌గూడలోని ఉమెన్స్ జైలులోనూ నివృత్తి డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఖైదీల్లో మాదకద్రవ్య వినియోగ సమస్యలను గుర్తించడం, స్క్రీనింగ్, కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి’ అని డీజీ వివరించారు.
