టీఎంసీ ఎమ్మెల్యే కారుపై గుడ్లు, రాళ్ల దాడి..హుగ్లీ జిల్లా ఉత్తరపారా ప్రాంతంలో ఘటన

టీఎంసీ ఎమ్మెల్యే కారుపై గుడ్లు, రాళ్ల దాడి..హుగ్లీ జిల్లా ఉత్తరపారా ప్రాంతంలో ఘటన
  • మమత సభకు వెళ్తుండగా వాహనాన్ని  అడ్డుకున్న ఆందోళనకారులు

కోల్‌‌‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే, వెస్ట్​ బెంగాల్ ​మాజీ సీఎం మమతా బెనర్జీ వర్గానికి చెందిన నేత కునాల్‌‌‌‌ ఘోష్‌‌‌‌ కారుపై శనివారం రాళ్లు, గుడ్లతో దాడి జరిగింది. పార్టీ చీఫ్​ దీదీ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభకు వెళ్తుండగా.. హుగ్లీ జిల్లా ఉత్తరపారా ప్రాంతంలో దుండగులు కునాల్ ఘోష్ కారును అడ్డుకున్నారు. 

నల్ల జెండాలతో వాహనాన్ని చుట్టుముట్టి ‘కునాల్ ఘోష్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. కారుపై రాళ్లు, గుడ్లు విసరడంతో వెనుక వైపు ఉన్న అద్దం పగిలిపోయింది. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే  కోల్‌‌‌‌కతాకు తిరుగు ప్రయాణమయ్యారు.  కాగా, టీఎంసీ ఓటమి తర్వాత పశ్చిమ బెంగాల్‌‌‌‌లో ఆ పార్టీ నేతలపై ఇలాంటి ‘గుడ్ల దాడి’ ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం.

ఇది పూర్తిగా ‘జంగల్ రాజ్’: కునాల్​

తన కారుపై జరిగిన దాడిపై కునాల్​ఘోష్​ స్పందించారు. ఇది పూర్తిగా ‘జంగల్ రాజ్’ అని ఫైర్​అయ్యారు. అక్కడ ఎలాంటి పోలీసు సిబ్బంది లేరని మండిపడ్డారు. అనంతరం తన వాహనంపై జరిగిన అటాక్ గురించి ఫిర్యాదు చేసేందుకు లాల్​బజార్​లోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే  లోపలకు తనను అనుమతించకపోవడంతో ఈమెయిల్ ద్వారా అలిపూర్ పోలీసు స్టేషన్‌‌‌‌లో కంప్లైంట్ చేసినట్లు కునాల్ ఘోష్‌‌‌‌ పేర్కొన్నారు.

 కాగా.. మమతా బెనర్జీ సభకు ప్రజలు రాకుండా బీజేపీ కుట్ర పన్నుతోందని, బీజేపీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఆఫ్రికన్ దేశాల్లోనూ  ఇలాంటి పరిస్థితులు ఉండవని మమతా బెనర్జీ విమర్శించారు.