పాండవుల గుట్టల్లో ఘనంగా పర్యాటక దినోత్సవం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

పాండవుల గుట్టల్లో ఘనంగా పర్యాటక దినోత్సవం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్ భూపాలపల్లి/రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవాలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై మాట్లాడారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పర్యాటక సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చెప్పారు.

పాండవుల గుట్టపై ఉన్న ప్రాచీన వర్ణచిత్రాలు, పాండవ, కౌరవుల యుద్ధ ఘట్టాలు, కోనేరు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయన్నారు. పాండవుల గుట్ట అభివృద్ధికి పర్యాటక శాఖ ద్వారా నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. కొండపై నుంచి కింది వరకు కాలినడక మార్గంలో స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా వివిధ మార్గాల్లో సుమారు రూ.10 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నామని, వీటికి సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు.

పర్యాటకుల కోసం గెస్ట్ హౌస్ ల నిర్మాణం, ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాండవుల గుట్ట, కోటంచ నరసింహస్వామి ఆలయం, మైలారం గుహలు, నవాబుపేట కోటగుళ్లు, ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్నవరం, రామప్ప, సమ్మక్క-సారలమ్మ, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ టూరిజం సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్సీ సిరిశెట్టి సంకీర్త్, అడిషనల్ కలెక్టర్లు అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విజయలక్ష్మి, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఓ అప్పలకొండ, టూరిజం ఆఫీసర్ రఘు, తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్, కొడవటంచ దేవాలయ చైర్మన్ సంపత్ రావు  పాల్గొన్నారు.