నా ఇల్లు కూలింది, నీ గర్వం అణగుతుంది.. ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా ఫైర్

నా ఇల్లు కూలింది, నీ గర్వం అణగుతుంది.. ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా ఫైర్

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మహారాష్ట్రలోని అధికార శివ సేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బాంద్రాలోని కంగనా ప్రాపర్టీని అక్రమ మార్పుల పేరుతో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసింది. దీంతో కంగనా ఆగ్రహానికి లోనయ్యింది. తన ముంబై ఇప్పుడు పీవోకేగా మారిందని ఆమె కామెంట్ చేసింది. తన ఇంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని స్పష్టం చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కంగనా ఓ వీడియో పంపింది. ఈ ట్వీట్ కు మీరు ఏదైతే చేశారో, అది మంచికే చేశారు.. ప్రజాస్వామ్యం ఖూనీ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే తన స్థలాన్ని కూల్చుతున్న వీడియోలను కూడా షేర్ చేసింది.

‘ఉద్ధవ్ ఠాక్రే నీకు ఏమనిపిస్తోంది? ఫిల్మ్ మాఫియాతో కలసి ఇవ్వాళ నా ఇంటిని కూల్చడం ద్వారా నాపై ప్రతీకారం తీర్చుకున్నావని భావిస్తున్నావా? ఇవ్వాళ నా ఇల్లు కూలింది. రేపు నీ గర్వం అణగుతుంది. ఇది కాల చక్రం. ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తుంచుకో. నువ్వు నాకు మంచే చేశావ్. కాశ్మీరీ పండిట్ లతో ఎలా వ్యవహరిస్తారో నాకు అవగతమైంది. దేశ ప్రజలకు నేనో మాటిస్తున్నా. అయోధ్య మీదే కాదు.. కాశ్మీర్ పైనా ఓ సినిమా రూపొందిస్తా. అలాగే దేశ ప్రజలను మేల్కొల్పుతా. నాపై ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఠాక్రే.. ఈ క్రూరత్వం నా మీద జరగడం మంచిదైంది. జై హింద్, జై మహారాష్ట్ర’ అని కంగనా ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని అటుంచితే బుధవారం కంగనా ముంబైకి చేరుకుంది. ఆమె రాక నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ బయట కంగనా మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సపోర్ట్ చేశారు.