రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా కరీంనగర్ : మంత్రి ఈటల

రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా కరీంనగర్ : మంత్రి ఈటల

కరీంనగర్: గతంలో కాకతీయ కాలువ నుంచి చెరువు నింపుకోవాలని ప్రయత్నిస్తే రైతుల మీద కేసులు పెట్టి జైళ్లో వేసేవారని ,ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్. కరీంనగర్ లో నిర్వ‌హించిన‌ వ్యవసాయంపై సమీక్ష సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. ‌. ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువ చివరి భూములకు నీరు అందే విధంగా ఇరువైపులా చెరువు కుంటలు నింపాలని నిర్ణయంచామని చెప్పారు.

ఎల్.ఎం.డి. ఎగువన ఎస్‌ఆర్‌ఎస్పీ కాకతీయ కాలువ నుంచి చెరువులు నింపేలా తూములు పెట్టేందుకు సీఎం అంగీకరించారని, వీటికి అనుమతులు ఇస్తున్నామ‌ని చెప్పారు మంత్రి. ఎల్.ఎం.డి. దిగువన పూర్తి స్థాయిలో కాకతీయ కాలువలకు తూములు పెట్టి చెరువులన్నీ నింపుతామ‌న్నారు. త‌ద్వారా భూగర్భ జలాలు పెరిగి ఎండాకాలంలో కూడా సాగు, తాగునీటి కొరత ఉండదన్నారు.

వెయ్యి కోట్ల రూపాయలతో ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ మొత్తాన్నిమరమ్మతులు చేసి 6 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచామ‌న్నారు. ఎండాకాలంలోనూ పారుతున్న వాగులపై చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామ‌ని , వచ్చే ఆరు నెలల్లో అన్ని చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి చేస్తామ‌ని చెప్పారు. చివరి ఆయకట్టు, చివరి ఎకరానికి నీరివ్వాలన్నదే త‌మ లక్ష్యమ‌ని చెప్పారు.

మిడ్‌ మానేర్‌ కింది భాగంలో 77 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేస్తున్నామన్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఈ ఏడాది రెండో పంట నాటికి నీళ్లిచ్చే పనులన్నీ పూర్తి చేస్తామ‌ని చెప్పారు. మొక్కజోన్న స్థానంలో కంది పంట వేయాలని నిర్ణయించామన్నారు. ఇక కరీంనగర్‌ సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా, రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా మారబోతుందని మంత్రి పేర్కొన్నారు.