రాజస్తాన్‌‌పై ఆర్సీబీ థ్రిల్లింగ్‌‌ విక్టరీ

రాజస్తాన్‌‌పై ఆర్సీబీ థ్రిల్లింగ్‌‌ విక్టరీ

ముంబై:  రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్‌‌సీబీ) మ్యాజిక్‌‌ చేసింది. 170 టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో 87 రన్స్‌‌కే సగం వికెట్లు కోల్పోయిన టైమ్‌‌లో   దినేశ్‌‌ కార్తీక్‌‌  (23 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 44 నాటౌట్‌‌), షాబాజ్‌‌ అహ్మద్‌‌ (26 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) ఖతర్నాక్‌‌ బ్యాటింగ్‌‌తో దంచడంతో మంగళవారం జరిగిన  మ్యాచ్‌‌లో 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత  రాజస్తాన్ 20 ఓవర్లలో 169/3 స్కోరు చేసింది. బట్లర్ (47 బాల్స్ లో 6 సిక్సర్లతో 70 నాటౌట్)తో పాటు  హెట్ మయర్ (31 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) రాణించారు. అనంతరం  కార్తీక్‌‌, షాబాజ్‌‌ మెరుపులతో ఆర్‌‌సీబీ 19.1 ఓవర్లలో 173/6 స్కోరు చేసి గెలిచింది. కార్తీక్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

గెలిపించిన డీకే, షాబాజ్‌‌

ఛేజింగ్ లో బెంగళూరుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు డుప్లెసిస్ ( 29), అనూజ్ రావత్ (26) రెండో ఓవర్లోనే బౌండ్రీల వేట ప్రారంభించి పవర్ ప్లేలో 48 రన్స్​ రాబట్టారు.  కానీ ఏడో ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన స్పిన్నర్‌‌ చహల్ డుప్లెసిస్‌‌ను ఔట్‌‌ చేసి రాయల్స్‌‌కు బ్రేక్‌‌ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో అనూజ్‌‌ను సైనీ వెనక్కు పంపాడు. తొమ్మిదో ఓవర్లో  కోహ్లీ(5)ని రనౌట్ చేయడంతో  పాటు విల్లే(0)ను క్లీన్ బౌల్డ్ చేసిన చహల్‌‌ ఆర్‌‌సీబీకి షాకిచ్చాడు. షాబాజ్‌‌ నిలకడగా ఆడినప్పటికీ  రూథర్ ఫర్డ్ (5)ను ఐదో వికెట్‌‌గా వెనక్కిపంపిన బౌల్ట్‌‌ రాయల్స్‌‌ను పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన  దినేశ్‌‌ కార్తీక్‌‌.. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్  సహా 21 రన్స్‌‌ రాబట్టి బెంగళూరును తిరిగి రేసులోకి తెచ్చాడు.  తర్వాతి ఓవర్లో తను రెండు ఫోర్లు కొట్టగా.. షాబాజ్‌‌ ఓ బౌండ్రీ బాదడంతో రాయల్స్‌‌ బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లారు. అదే జోరు కొనసాగించిన షాబాజ్‌‌.. ప్రసిధ్‌‌ ఓవర్లో 4,6.. బౌల్ట్‌‌ బౌలింగ్‌‌లో 4, 6 రాబట్టి ఆర్‌‌సీబీ శిబిరంలో జోష్‌‌ నింపాడు.  విజయానికి 14 రన్స్‌‌ అవసరమైన దశలో తను ఔటైనా.. ప్రసిధ్‌‌ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన కార్తీక్‌‌ రాజస్తాన్‌‌ ఆశలపై నీళ్లు చల్లాడు. జైస్వాల్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్‌‌ తొలి బాల్‌‌కు సిక్స్‌‌తో  హర్షల్‌‌ (9 నాటౌట్​) మ్యాచ్‌‌ ముగించాడు. 

బట్లర్‌‌, హెట్‌‌మయర్‌‌ హిట్‌‌

టాస్‌‌ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రెండో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ బట్లర్ వన్‌‌డౌన్‌‌ బ్యాటర్‌‌ పడిక్కల్(37)తో ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. ఆర్ సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో  పవర్ ప్లేలో రాయల్స్ 35/1 మాత్రమే చేసింది. అయితే, ఆకాశ్ దీప్ వేసిన ఏడో ఓవర్లో బట్లర్ క్యాచ్ రెండు సార్లు వదిలేసిన ఆర్‌‌సీబీ మూల్యం చెల్లించుకుంది. పదో ఓవర్లో  పడిక్కల్​ను ఔట్ చేసిన హర్షల్.. రెండో వికెట్ కు 70 రన్స్ పార్ట్‌‌నర్​ షిప్ బ్రేక్ చేశాడు. దీంతో సగం ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి రాజస్తాన్ 76/2తో నిలిచింది. ఆపై క్రీజులోకి వచ్చిన శాంసన్ (8) హసరంగ బౌలింగ్ లో లాంగాన్ లో సూపర్ సిక్స్ బాదినా.. అదే ఓవర్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంతో బట్లర్, హెట్ మయర్ బౌండ్రీలు కొట్టలేకపోయారు. దాంతో, రాయల్స్ 150 చేస్తే గొప్పే అనిపించింది. కానీ, చివరి రెండు ఓవర్లలో బట్లర్‌‌ రెచ్చిపోయాడు. 19వ ఓవర్లో రెండు సూపర్‌‌ సిక్సర్లు కొట్టిన తను  ఆఖరి ఓవర్లోనూ రెండు సిక్సర్లు బాదాడు.  లాస్ట్‌‌ బాల్‌‌ను స్టాండ్స్‌‌కు పంపిన హెట్‌‌మయర్ మంచి సపోర్ట్ ఇవ్వడంతో చివరి 18 బాల్స్ లో 51 రన్స్ రాబట్టిన రాయల్స్‌‌ మంచి స్కోరే చేసింది.

సంక్షిప్త స్కోర్లు

రాజస్తాన్: 20 ఓవర్లలో 169/3 (బట్లర్ 70 నాటౌట్, హెట్ మయర్ 42 నాటౌట్, హర్షల్ 1/18, విల్లే 1/29)
బెంగళూరు:  19.1 ఓవర్లలో 173/6 (షాబాజ్​ 45, కార్తీక్‌‌ 44*, చహల్‌‌ 2/15, బౌల్ట్ 2/34