కేసీఆర్ కు పదేండ్లు అధికారమిస్తే ఏం చేసిండు? :కవిత

కేసీఆర్ కు పదేండ్లు అధికారమిస్తే ఏం చేసిండు? :కవిత
  •  
  • ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం దక్కలే: కవిత  
  •     కేశవరావ్ జాదవ్​కు అధికారికంగా అంత్యక్రియలు చేయలే 
  •     తెలంగాణేతరులకు మాత్రం లాంఛనాలతో చేశారు 
  •     రవీంద్ర భారతిలో ఎవరెవరివో విగ్రహాలు పెడుతున్నరు
  •     తెలంగాణవాసులను బలితీసుకున్న కేబీఆర్ ​పేరుతో పార్క్​ ఇంకా 
  • ఉండడం బాధాకరం    అక్కడ జయశంకర్ ​విగ్రహం పెట్టాలని కేటీఆర్​ను ఎన్నోసార్లు కోరిన 
  •     ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కామెంట్స్​

ముషీరాబాద్, వెలుగు:  సబ్బండ వర్గాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిమందికే అవకాశాలు దక్కాయని, వాళ్లు సైతం అసలైన ఉద్యమకారులనే అవమానించే పరిస్థితి వచ్చిందన్నారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సభకు పదికిపైగా ఉద్యమ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘‘స్వరాష్ట్రంలో కొంత మంది ఉద్యమకారులకే అవకాశాలొచ్చాయి.. అవకాశాలు వచ్చిన వాళ్లు ఉద్యమకారులకు అండగా ఉంటారని భావించాం. కానీ వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి వచ్చింది. అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగింది. దీన్ని చూసి మీరు బయట ఉండి బాధపడితే నేను పార్టీలో ఉండి బాధపడ్డా” అని చెప్పారు. మనవాడే మనల్ని పురుగుల్ని చూసినట్లు చూశాడని.. ఉద్యమాన్ని కించపరిచోనోళ్లు, ఉద్యమకారులను కొట్టించినవాళ్లు కేసీఆర్ చుట్టూ చేరారన్నారు. అహంకారం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు.  

కేసీఆర్​ హయాంలో న్యాయం చేయలేదు..

మాజీ సీఎం కేసీఆర్ ను అనాలనే ఉద్దేశం తనకు లేదని, కానీ పదేండ్లు అవకాశమిస్తే ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదని అడగాల్సిందేనని కవిత అన్నారు. ఉద్యమకారులతో పాటు, నిరుద్యోగులకు, అమరవీరులకు ఒరిగిం దేమీ లేదన్నారు. తెలంగాణ వచ్చాక కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకు న్నారని, వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆ రోజున న్యాయం చేయకపోవడం వల్ల ఉద్యమకారులు మళ్లీ పోరాటానికి సిద్ధమ వుతున్నారని, వారికి అండగా పోరాటం చేస్తానని ప్రకటించారు. ఈ ప్రభుత్వంలో నూ వారికి న్యాయం జరగడం లేదన్నారు. మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుదామని, ఇప్పుడు ఉద్యమకారులపై లాఠీ దెబ్బ పడాలంటే ముందు తన మీద పడాల్సిందేన న్నారు. ఉద్యమకారులకు బుల్లెట్ తగలాలంటే అది తనను దాటి వెళ్లాలన్నారు. 

మాది తెలంగాణ పేరు కాపాడే పార్టీ 

తెలంగాణ ఆస్తిత్వాన్ని కాపాడేందుకు త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని కవిత స్పష్టం చేశారు. తమది ఫక్తు రాజకీయ పార్టీ కాదని, తెలంగాణ పేరు, అస్తిత్వాన్ని కాపాడే పార్టీగా ఉంటుందన్నారు. పొలిటికల్ పార్టీ పెడతానని అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎప్పుడూ తన పక్కన ఉద్యమకారులే తప్ప పైరవీకారులు లేరన్నారు. ఉద్యమకారుల అజెండాతోనే తమ పార్టీ ముందుకు పోతుందన్నారు. బీఆర్ఎస్​హయాంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని.. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినా, యూట్యూబ్ లో వీడియో పెట్టినా అరెస్టులు చేసి కేసులు పెట్టారన్నారు. గత ప్రభుత్వంలో జీ హుజూర్ అని ఉంటే అక్కడే ఉండేదాన్ని అని, క్యా హుజూర్ అన్నందుకే ఇక్కడ ఉన్నానన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే  గౌరవం, ఆర్థిక, అభివృద్ధి, రాజకీయ అవకాశాలు వస్తాయని భావించిన ఉద్యమకారులకు బాధే మిగిలిందన్నారు. మంచితనం, సహనశీలత, భోళాతనమే తెలంగాణ తత్వం అని, అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లేనన్నారు.


చేదు జ్ఞాపకాలు అట్లనే ఉన్నయ్​

తెలంగాణ వచ్చాక కూడా చేదు జ్ఞాపకాలు అట్లనే ఉన్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కేశవరావు జాదవ్ చనిపోతే ఎందుకు అధికారికంగా అంత్యక్రియలు జరపలేదని కవిత గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రాంతం కాని ఎంతో మందికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారని విమర్శించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 369 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నాడని, పార్కుకు ఇంకా ఆయన పేరు ఉండడం బాధాకరమన్నారు. ఏ చేదు గుర్తులు ఉండకూడదని అనుకున్నామో ఆ గుర్తులు ఇంకా ఉండటం వేదనను కలిగిస్తోందన్నారు. ఇది చాలదన్నట్టు మనవాళ్లే గాయాలు చేయడంతో నొప్పి ఎక్కువగా ఉందన్నారు. 

ఈ ముఖ్యమంత్రికీ ఆ సోయి లేదు

కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలని, అప్పటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్​ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశానని, అయినా పెట్టలేదని కవిత చెప్పారు. ట్యాంక్ బండ్ పై కూడా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోయామన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ కూడళ్లలో ఎవరెవరివో విగ్రహాలు పెడుతున్నారని తప్పుపట్టారు. రవీంద్రభారతిలో గద్దర్, బిరుదురాజు రామరాజు, సుద్దాల హన్మంతు లాంటి వాళ్ల విగ్రహాలు ఉండాల్సిందని.. కానీ, ఎవరెవరి విగ్రహాలో అక్కడ దర్శనమిస్తున్నాయన్నారు. కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేశారని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, కానీ, ఈ ముఖ్యమంత్రికీ ఉద్యమ సోయి లేదన్నారు. బతుకమ్మను తీసేసి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాడని తప్పుపట్టారు. అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డిని ప్రజలు బయటికి గుంజుతరని హెచ్చరించారు. 

 కోదండరాం, మురళి వెంటపడతాం 

కోదండరాం, ఆకునూరి మురళి వంటి విద్యావేత్తలు రేవంత్ రెడ్డితో కలవడంతోనే కాంగ్రెస్ ను ఓటర్లు నమ్మారని, ఇప్పుడు వాళ్లిద్దరూ ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. హామీలు నెరవేర్చకపోతే వారి వెంట పడతామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు రూ.5 వేల కోట్లు ధారబోసినా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు లాభం జరగలేదని, కానీ, మేఘా కృష్ణారెడ్డి అపర కుబేరుడయ్యాడన్నారు. ఇప్పటికైనా కోదండరాం, మురళి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. విద్యా కమిషన్ నివేదిక ఏమైంది? గురుకులాల్లో పిల్లలు చనిపోతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ప్రొవిజన్ పెట్టాలని, లేదంటే ఊకోమన్నారు. 

కేసులున్న వారే ఉద్యమకారులా? 

హైదరాబాద్ లో ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ మన వాళ్లకు ఉద్యోగాలు రావటం లేదని, ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్​చేశారు. కేసులున్న వారే ఉద్యమకారులని అంటున్నారని, మరి తనపై కూడా కేసు లేదన్నారు. ఉన్న కేసులను కోర్టు కొట్టివేసిందని, కేసులు లేకుండా కూడా ఎంతో మంది ఉద్యమం చేశారన్నారు. మీడియా మిత్రులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారని, ఎంతో మంది పేపర్లు పెట్టి, తెలంగాణ సాహిత్యాన్ని ప్రచురించి ఆస్తులు అమ్ముకున్నారని.. వారికి కూడా న్యాయం జరగాలన్నారు.  

ఉద్యమకారుల గుర్తింపునకు యాప్  

ఉద్యమకారులను గుర్తించేందుకు యాప్ సిద్ధం చేశామని కవిత చెప్పారు. అప్పుడు కూడా ప్రభుత్వం గుర్తించకపోతే కోదండరాం, ఆకునూరి మురళిని పట్టుకుందామన్నారు. యాప్ లో ఎన్ రోల్ చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తామన్నారు.