- అదే రోజు పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తం
- రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు..
- ఇక తెలంగాణ జాగృతి ప్రజల ఇంటి పార్టీ
- యువత, మహిళలు, ఉద్యమకారులకు పెద్ద పీట
- రాష్ట్రం వచ్చి 12 ఏండ్లు దాటినా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకోలేకపోయాం
- కొత్త పార్టీ రాష్ట్ర భవిష్యత్‌కు
- దారిదీపంలా ఉంటుందని కామెంట్
నిజామాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా మారబోతున్నదని సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ మార్చే దారిదీపంలా తమ పార్టీ ఉండబోతుందని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా సర్వజనుల్లో కొత్త వెలుగులు నింపేలా సర్వోదయ తెలంగాణ కోసం పార్టీ పనిచేస్తుందన్నారు. శుక్రవారం నిజామాబాద్ జాగృతి ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి రాష్ట్రాన్ని వదిలేసింది. తెలంగాణ సోయిలేక ప్రజల ఆదరణ కోల్పోయింది. ఆ లోటును భర్తీ చేస్తూ స్టేట్‌లోని ప్రజలందరి ఇంటి పార్టీని ఏర్పాటు చేయబోతున్నం. మేం పూర్తి స్వతంత్రంగా పనిచేస్తం. కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలియగానే కొందరు బీటీం పుకార్లు సృష్టిస్తున్నరు. తెలంగాణలో పక్కా మాదే నంబర్‌వన్ పార్టీ అవుతది. కల్లబొల్లి మాటలు, అబద్ధాలకు స్థానం ఇవ్వం. మా ఎజెండా పూర్తి ప్రాక్టికల్‌గా ప్రజల ఆమోదం పొందేలా ఉంటది’ అన్నారు. 12 ఏండ్ల తెలంగాణలో ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా సాధించలేదని, పదేండ్ల బీఆర్ఎస్తో సహా రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మౌలిక వసతుల కోసం పోరాడాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. ఇప్పటి కీ కూడా బస్సు ప్రమాదాలు, కుక్క కాట్లు, మక్క కొను గోలు సెంటర్ల ఏర్పాటు వంటి వాటి కోసం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. తమ పార్టీ పూర్తి ఫోకస్ రాష్ట్ర ప్రయోజనాలపైనే ఉంటుందని, జాతీయ అంశాలను కూడా నిశితంగా గమనిస్తామని కవిత చెప్పారు. ‘అజెండా రూపకల్పనకు ఇప్పటికే 50 కమిటీలు వేసినం. మేధావులతో చర్చలు జరిపినం. ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి వాట్సాప్ నంబర్ అందుబాటులో పెడ్తం. ఇన్నాళ్లు మగవాళ్ల పార్టీలే చూశారు. ఆడబిడ్డగా నేను పెట్టబోయే పార్టీ ఎలా ఉంటదో చూస్తరు. శ్రీరాముడిని స్ఫూర్తిగా తీసుకొని నవమి రోజు పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తున్న’ అని కవిత చెప్పారు. తాను ముహూర్తాలు నమ్ముతానని, కాశీకి వెళ్లి శివుడికి అభి షేకం పూర్తి చేశాక పార్టీ పేరు, జెండా, ఎజెండా అన్నీ వచ్చే నెల 25న ప్రకటిస్తానన్నారు. అప్పటి వరకు రాష్ట్రంలోని అభ్యుదయ, సామాజిక తెలంగాణ కాక్షించే మేధావులతో చర్చలు జరుపుతానని, పార్టీ ఆవిర్భావ సభ గొప్పగా ఉండబోతన్నదన్నారు. తాను అమితంగా ఇష్టపడే ప్రొఫెసర్ జయశంకర్ సార్పేరుతో పాటు పలువురు ఉద్యమకారుల పేర్లను స్మరిస్తూ సభా వేదిక ఏర్పాటు చేస్తామని కవిత వెల్లడించారు.
రాజకీయాలు రాకెట్ సైన్స్ కాదు
గొప్ప మార్పు లక్ష్యంగా ఏర్పాటు చేయబోయే పార్టీలో మహిళలు, యూత్‌కు పెద్దపీట వేస్తామని కవిత తెలి పారు. తెలంగాణ తొలి, మలిదశ ‘ఉద్యమకారుల అనుభవాలు, కొత్త, పాత కలయికతో పార్టీ నిర్మించబోతున్నం. బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా వరకు మాతో టచ్‌లో ఉన్నరు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం నాతో చేతులు కలపాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్న. ఇన్నాళ్లూ నన్ను విమర్శించిన వారికైనా సరే ఆహ్వానం పలుకుతున్న’ అంటూ కవిత పిలుపునిచ్చారు. పాలిటిక్స్‌లో ఇగోకు స్థానం ఉండరాదన్నారు. రాజకీయాలు రాకెట్‌సైన్స్ కాదని, ప్రజల జీవితాలు మార్చే పాలిటిక్స్‌లోకి అందరూ అడుగుపెట్టాలని సూచించారు.
ప్రతిపక్షంలో ఉంటే క్రిటిసిజం.. తర్వాత ఎస్కేపిజం
రాష్ట్రంలోని పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రిటిసిజంతో ప్రజల దృష్టిని ఆకర్షించి, అధికారంలోకి వచ్చాక ఎస్కేపిజం సూత్రాన్ని పాటిస్తున్నాయని కవిత ఎద్దేవా చేశారు. ఫలానా అని కాకుండా నేతలందరి తీరు ఇట్లనే మారిందన్నారు. తమనెవరు ప్రశ్నిస్తారనే ధీమా వారిలో పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని, మన జీవితాలను శాసించే రాజకీయాల్లోకి అందరూ రావాలని సూచించారు. ఢిల్లీలో లాబీయింగ్ఎట్ల చేయాలో తెలిసి న నాకు గల్లీలో కష్టపడి పనిచేయడం కూడా తెలుసని, ఎంపీగా పనిచేయడం వల్ల నాకు దేశవ్యాప్త పరిచయాలు ఏర్పడ్డాయని కవిత తెలిపారు
నిజామాబాద్ కోడల్ని.. అందుకే ప్రయారిటీ
వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో మున్ముం దు పార్టీ నిర్ణయిస్తుందని కవిత తెలిపారు. కానీ, నిజా మాబాద్ కోడలుగా జిల్లాకు అన్ని విషయాల్లో ప్రయా రిటీ ఉంటుందన్నారు. ‘బీఆర్ఎస్ నుంచి నన్ను గెంటేశా రు. కొత్త లక్ష్యాలతో పార్టీ పెట్టి ముందు కు వెళ్లాలని నిర్ణయించిన. ప్రజలందరి ఆశీర్వాదం తమకు ఉంటది. 20 ఏండ్ల నుంచి జాగృతి సేవలు జనానికి తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతులు, మహిళలు, యూత్, నిరుద్యోగులు, కార్మికులందరి కోసం పనిచేసినం’ అని చెప్పారు.
