- వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు: ఎమ్మెల్సీ కవిత
- బీసీల విషయంలో బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు
- ఉద్యమ చరిత్రలో అందరికీ ఒక్క పేజీనే.. కేసీఆర్‌కు పుస్తకమే ఉంటది
- కేసీఆర్‌పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని ఫైర్
- 12న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ.. పోస్టర్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని గుర్తు చేశారు. కానీ, ఆ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాధవ్ రెడ్డి అనే వ్యక్తి మరొకరితో కలిసి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారని, అలాంటి వ్యక్తికి మున్సిపల్‌ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
ఈ నెల 12న నిర్వహించనున్న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను ఆమె శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి ఆఫీసులో ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ఇచ్చిందంటే.. హైకోర్టులో కేసును బీఆర్ఎస్ పార్టీనే వేయించినట్టు ఉందన్నారు. మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హరీశ్ రావుకు దగ్గరని, హరీశ్ పర్సనల్ లాయరే ఈ కేసు వేయించారని ఆరోపించారు. తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీల నోటికాడి బుక్క గుంజుకునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. బీసీల విషయంలో బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరమ్పేరుతో మీటింగ్‌లు పెట్టిన బీఆర్ఎస్ .. పార్టీపరంగా ఒక్క మీటింగ్ కూడా నిర్వహించలేదన్నారు. జనగణన విషయంలో కన్ఫ్యూజ్ చేశారని, మళ్లీ వాళ్లే జనగణన చేయాలంటూ డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
అన్ని చోట్లా మావోళ్లున్నరు
జాగృతి 20 ఏండ్ల సంస్థ అని, ఎంతో మందిని లీడర్లుగా చేసిందని కవిత చెప్పారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు అన్ని చోట్లా తమవాళ్లున్నారని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నిజామాబాద్‌కు ఎన్నికల ఇన్చార్జ్గా కాంగ్రెస్ పార్టీ పంపిందన్నారు. పార్టీపరంగా లెటర్ ఇచ్చి మరి.. ఆయన్ను కాంగ్రెస్ ఇన్చార్జ్గా చేసిందన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయనకు ప్రతిపక్షాలకు ఇచ్చే పీఏసీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారన్నారు. ప్రకాశ్‌గౌడ్, తెల్లం వెంకట్రావును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా స్పీకర్ ప్రకటించారని, వారినీ ఇన్చార్జులుగా కాంగ్రెస్ పార్టీ నియమించిందని విమర్శించారు. ప్రజల తీర్పును కాంగ్రెస్ అవమానిస్తున్నదన్నారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్ల బడ్జెట్పెడతామని కాంగ్రెస్ చెప్పిందని, గత రెండు బడ్జెట్లు కలిపి రూ.7 వేల కోట్లు కూడా పెట్టలేదని కవిత విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే తాము సింహం గుర్తుపై పోటీ చేస్తున్నామన్నారు. తమలాగే ప్రశ్నించేతత్వమున్న సీపీఎం, న్యూ డెమొక్రసీ సహా స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కేసీఆర్‌కు ఓ పుస్తకమే ఉంటది
తెలంగాణ ఉద్యమంలో అందరికీ ఒక పేజీ ఉంటే.. కేసీఆర్‌కు ఒక పుస్తకమే ఉంటుంద ని కవిత అన్నారు. చరిత్రను ఎవరూ చెరిపేయలేరన్నారు. రేవంత్ చరిత్ర మంచిదా చెడ్డదా అనేది ఆయనే అర్థం చేసుకోవాలన్నారు. తాను కేసీఆర్‌కు మద్దతుగా మాట్లాడడం లేదని, రాజకీ యంగా ఆయన విధానాలను విభేదిస్తానని చెప్పారు. విమర్శలు చేసేటప్పుడు ఒక లైన్ఉంటుందని, కానీ సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అనే చిన్న చేపను పట్టుకొని పెద్ద చేపలను వదిలేసే ప్రయత్నం జరుగుతు న్నట్టు కనిపిస్తున్న దన్నారు. డీఎస్పీగా ఉన్న ఆయనకు డిమోషన్ ఇచ్చారంటే ఏమైనా ఆధారం దొరికి ఉండొచ్చన్నారు.
