కవిత ఖాతాలో మున్సిపాలిటీ..వడ్డేపల్లిలో పార్టీ మద్దతుదారుల గెలుపు

కవిత ఖాతాలో మున్సిపాలిటీ..వడ్డేపల్లిలో పార్టీ మద్దతుదారుల గెలుపు
  •  
  • గద్వాల జిల్లా 
  • వడ్డేపల్లిలో పార్టీ మద్దతుదారుల గెలుపు
  • 10కి 8 స్థానాల్లో విజయం సాధించిన ఫార్వర్డ్​ బ్లాక్
  • కాంగ్రెస్‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌కు చెరో స్థానం
  • చైర్మన్‌‌ పదవి కోసం అన్నదమ్ముల మధ్య వార్


గద్వాల, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఖాతాలోకి మున్సిపాలిటీ చేరింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో సింహం గుర్తు (అఖిల భారత ఫార్వర్డ్​ బ్లాక్)పై పోటీ చేసిన తెలంగాణ జాగృతి క్యాండిడేట్లు 10 వార్డులకుగాను 8 చోట్ల గెలిచారు. ఒక వార్డులో కాంగ్రెస్, మరో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు  గెలిచారు. అలంపూర్​ సెగ్మెంట్​ పరిధిలోని వడ్డేపల్లి  మున్సిపాలిటీలో అనూహ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డీలా పడ్డాయి. మున్సిపల్​ ఎన్నికలకు ముందు  జాగృతిలో చేరిన బీఆర్ఎస్​ లీడర్​ వడ్డేపల్లి శ్రీను చక్రం తిప్పారు.  కాంగ్రెస్​లో వర్గపోరు, బీఆర్ఎస్​లో నాయకత్వ లోపం ఇక్కడ జాగృతికి కలిసివచ్చాయి.     

చైర్మన్‌‌‌‌ పదవి కోసం క్యాంపు..

వడ్డేపల్లిలో మున్సిపల్‌‌‌‌ చైర్మన్​​ఎన్నిక వ్యవహారంపై పీఠముడి నెలకొన్నది. అన్నదమ్ములైన వడ్డేపల్లి శ్రీను, లక్ష్మిరెడ్డి కొడుకులు అజయ్, యుగంధర్ రెడ్డి వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. శ్రీను కొడుకు అజయ్ చైర్మన్‌‌‌‌ పదవిని  ఆశించగా.. ఆయన బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. దీంతో లక్ష్మిరెడ్డి కొడుకు యుగంధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి పదవి కట్టబెట్టాలని జాగృతి నేతలు  ప్రతిపాదించారు. అయితే.. అజయ్‌‌‌‌కి పదవి దక్కకూడదని యుగంధరెడ్డి కుట్ర చేశాడని, అజయ్ ఓటమికి అతడే కారణమని శ్రీను వర్గం ఆగ్రహంతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యుగంధర్ రెడ్డికి పదవి దక్కొద్దని భావించిన శ్రీను, అజయ్.. గెలిచిన వారిని క్యాంపుకు తరలించారు. యుగంధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మినహా మిగిలిన ఏడుగురు ప్రస్తుతం శ్రీనుతో పాటే క్యాంపునకు వెళ్లారు. కాగా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై జాగృతి కాండిడేట్లు పావని,  శర్వానంద,  మంజుల,   యుగంధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి,   కాశపోగు దేవమ్మ,  విజయభాస్కర్,  జయశ్రీ,  తిమ్మప్ప. బీఆర్​ఎస్​ నుంచి సూరి, కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గెలిచారు.