V6 News

నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే గానీ తెలంగాణ రాలే: కేసీఆర్​

నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే గానీ తెలంగాణ రాలే: కేసీఆర్​
  • నేను ఆమరణ నిరాహార దీక్ష  చేస్తే గానీ తెలంగాణ రాలే
  • దేశానికి లక్ష్యమంటూ ఉందా?  ఆలోచిస్తేనే నాకు భయమేస్తున్నది
  • ఎన్నికల రాజకీయ తంత్రంలో దేశం చిక్కుకుపోయిందని కామెంట్​
  • నాగ్​పూర్​లో బీఆర్ఎస్ ​ ఆఫీసు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్​ కేవలం రాజకీయ పార్టీ కాదు.. అదొక మిషన్. మహారాష్ట్రను మాత్రమే కాదు మొత్తం దేశాన్ని సంస్కరించడమే మా పార్టీ మిషన్. అది సాధించే వరకు విశ్రమించబోం” అని బీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్​ అన్నారు. తమది ప్రాంతీయ పార్టీ కాదని, జాతీయ పార్టీ అని చెప్పారు. తాను విదర్భకు సపోర్ట్​ చేయడం లేదనేది వట్టి మాట అని అన్నారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటు విధానమే సరిగా లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను 15 ఏండ్లు పోరాడిన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని ఆయన అన్నారు. 

గురువారం మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో బీఆర్ఎస్​ ఆఫీసును కేసీఆర్​ ప్రారంభించారు. అనంతరం సభలో, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశంలో పరివర్తన కోసమే బీఆర్ఎస్​ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయిందని చెప్పారు. ప్రజల మధ్య కులం, మతం అంటూ కొట్లాటలు పెట్టి ఎన్నికల్లో గెలవాలనేది పార్టీల వ్యూహమని, దీనిపై  చర్చ జరగాలని పేర్కొన్నారు. ‘‘ దేశానికి లక్ష్యమంటూ ఉందా?  ఈ విషయం ఆలోచిస్తే నాకు భయం వేస్తున్నది. జనాభాలో మన దేశం చైనాను దాటేసింది. కానీ, ఔరంగాబాద్​లో 8 రోజులకోసారి నల్లా నీళ్లు వస్తున్నయ్​. ఢిల్లీలోనూ అదే దుస్థితి ఉంది. దేశాన్ని ఇన్నేళ్లు పాలించిన వాళ్లు ప్రజలకు కరెంట్, సాగు, తాగునీళ్లు కూడా ఇవ్వలేకపోయారు” అని విమర్శించారు. ఉద్యమాలు చేసి ప్రజలు విసుగు చెందాని, వారంతా మార్పును కోరుకుంటున్నారని అన్నారు.

పుణె, ముంబైలో పార్టీ ఆఫీసులు ప్రారంభిస్తం

మహారాష్ట్రలో బీఆర్ఎస్​కు మంచి ఆదరణ వస్తున్నదని, 4 లక్షల మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారని కేసీఆర్​ తెలిపారు. త్వరలోనే ఈ సంఖ్య 25 లక్షల నుంచి 30 లక్షలకు పెరుగుతుందని అన్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా తమ వైపు చూస్తున్నారని చెప్పారు. యువతకు అవకాశం కల్పించాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పార్లమెంట్​సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ ​కోసం ఔరంగాబాద్​లో బిల్డింగ్​ కొన్నామని, పుణె, ముంబైలో కూడా పార్టీ ఆఫీస్​లు ప్రారంభిస్తామని తెలిపారు.  ‘‘ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశంలో లక్షల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి చింతా లేదు. 

వీరిని ఎలా మేల్కొల్పాలి. దేశాన్ని సంస్కరించేందుకు మహారాష్ట్ర వేదికగా బలమైన అడుగులు పడ్డయ్​. యావత్ దేశం తప్పకుండా సంస్కరించబడుతది” అని కేసీఆర్​ అన్నారు. ఒకప్పుడు మహారాష్ట్ర కన్నా తెలంగాణలో ఎక్కువగా రైతులు ఆత్మహత్య చేసుకునే వారని, ఆ సంఖ్య ఇప్పుడు భారీగా తగ్గిపోయిందని చెప్పారు. అన్నారు. రైతులకు 24 గంటలు కరెంట్​ఇస్తున్నామని, రైతు సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోనే సాధ్యమైన ఇవన్నీ పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావో ఆలోచించాలన్నారు..