మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం 'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' (Vaazha 2: Biopic of a Billion Bros) రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ. 10 --12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 164 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం రూ. 200 కోట్ల మార్కు వైపు పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్' (రూ. 158.50 కోట్లు) రికార్డులను కూడా ఈ సినిమా తుడిచిపెట్టేసింది.
'వాళా 3' రంగం సిద్ధం!
వరుస విజయాలతో జోరు మీదున్న ఈ ఫ్రాంచైజీ నుండి మూడవ భాగం కూడా రాబోతోంది. చిత్ర రచయిత విపిన్ దాస్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మూడు వేళ్లను చూపిస్తూ, "'వాజా ' పెరుగుతోంది.. రేపు కలుద్దాం" అనే క్యాప్షన్‌తో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇది 'వాజా3' ప్రాజెక్ట్‌ను దాదాపు ధృవీకరిస్తోంది. రెండో భాగంలో నటీనటులు మారినట్లుగానే, మూడో భాగంలో కూడా కొత్త తరం ఇన్‌ఫ్లుయెన్సర్లు కనిపిస్తారా లేదా ఇదే 'బిలియన్ బ్రోస్' టీమ్ కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు, తమిళంలో రిలీజ్ కు రెడీ..
మలయాళంలో ఊహించని రీతిలో విజయం సాధించిన ఈ చిత్రం, ఏప్రిల్ నెలాఖరు నాటికి తెలుగు, తమిళ భాషల్లో కూడా థియేటర్లలో విడుదల కానుంది. మలయాళ కథలు , కామెడీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో, 'వాజా 2' ఇక్కడ కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మే నెలలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ (JioHotstar) దక్కించుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన 4 నుండి 6 వారాల తర్వాత అంటే, మే రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
చిత్ర నేపథ్యం..
సవిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్‌లో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి ప్రధాన పాత్రలు పోషించారు. పాఠశాల జీవితం, స్నేహం, తండ్రి-కొడుకుల బంధం చుట్టూ సాగే ఈ కథ సాధారణ కుర్రాళ్ల జీవితాలను ప్రతిబింబించడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఓవర్‌సీస్ మార్కెట్‌లో రూ. 73.75 కోట్లు, ఇండియాలో రూ. 89.75 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం రూ. 200 కోట్ల మార్కు వైపు పరుగులు తీస్తోంది.
మొత్తానికి, 'వాజా' ఫ్రాంచైజీ కేవలం సినిమాలగానే కాకుండా మాలీవుడ్‌లో ఒక బాక్సాఫీస్ బ్రాండ్‌గా అవతరించింది. మూడవ భాగం గురించి వెలువడనున్న అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

