ఒక్క హాట్ డాగ్ తింటే మనిషి ఆయుష్షు 36 నిమిషాలు తగ్గుతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.
అసలు అధ్యయనం ఏం చెబుతోందంటే
'నేచర్ ఫుడ్' పత్రికలో వచ్చిన పరిశోధన ప్రకారం.. హాట్ డాగ్స్, బేకన్, సాసేజ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు ఆరోగ్యానికి హానికరమని తేలింది. వీటిలో ఉప్పు అంటే సోడియం, కొవ్వులు, నిల్వ ఉండటానికి వాడే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల ముప్పును పెంచుతాయి. ఈ లెక్కన ఒక హాట్ డాగ్ తిన్నప్పుడు శరీరానికి జరిగే నష్టాన్ని నిమిషాల్లో లెక్కిస్తే అది 36 నిమిషాల ఆయుష్షుతో సమానమని పరిశోధకులు అంచనా వేశారు.
నిజంగా హాట్ డాగ్స్ ప్రమాదకరమా
36 నిమిషాలు అనేది వినడానికి భయంగా ఉన్నప్పటికీ, ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు ఒక హాట్ డాగ్ తిన్నంత మాత్రాన ఆయుష్షు తగ్గిపోదు. కానీ, రోజూ ఇలాంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం అలవాటుగా మారితే మాత్రం దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు హాట్ డాగ్స్ ఇష్టపడితే, వాటిని ఎప్పుడో ఒకసారి మాత్రమే తీసుకోవడం మంచిది. హాట్ డాగ్ వంటి ఆహారం తీసుకున్నప్పుడు, దానితో పాటు పండ్లు, కూరగాయలు వంటి పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కొంతవరకు నష్టాన్ని తగ్గించవచ్చు.
ఈ అధ్యయనం మనల్ని భయపెట్టడానికి కాదు, కానీ మన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచడానికి తీసుకొచ్చింది. మనం తీసుకునే ప్రతి ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఇలాంటి వార్తలను చూసి కంగారు పడకుండా, ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, పోషకాలు ఉండేలా చూసుకోవడమే అసలైన రహస్యం. ఒక్క పూట భోజనం కంటే, మనం ప్రతిరోజూ పాటించే అలవాట్లే మన ఆయుష్షును నిర్ణయిస్తుంది.

