130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై  కీలక భేటీ..హాజరైన తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు 

130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై  కీలక భేటీ..హాజరైన తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు 
  • 30 రోజులు జైళ్లో ఉంటే పీఎం, సీఎం, మంత్రుల పదవులూడే బిల్లుపై కసరత్తు
  • తెలంగాణతో పాటు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, పంజాబ్ నుంచి హాజరైన ప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు: క్రిమినల్ కేసుల్లో అరెస్టయి 30 రోజులు జైళ్లో ఉంటే పీఎం, సీఎం, మంత్రులు తమ పదవులను కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్‌‌‌‌‌‌‌‌లో కీలక సమావేశం జరిగింది. ప్రధానంగా 130వ రాజ్యాంగ (సవరణ) బిల్లు-2025, జమ్మూ అండ్ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు-2025, కేంద్ర పాలిత ప్రాంతాల (సవరణ) బిల్లు-2025లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన ఈ భేటీకి తెలంగాణ, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు చాణక్య నేషనల్ లా వర్సిటీ (పాట్నా), మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇనిస్టిట్యూషన్ (తెలంగాణ), బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ వర్సిటీ (లక్నో) ప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తెలిపిన సీఎస్ రామకృష్ణ రావు

తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణ రావు ఈ సమావేశంలో పాల్గొని, 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను కమిటీకి వివరించారు. ఈ సవరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలు సూచనలు, సలహాలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం ప్రతిపాదించిన ఈ సవరణలో కొన్ని సెక్షన్ల కింద నమోదయ్యే కేసులు, 30 రోజుల పాటు జైళ్లో ఉండే నిబంధనలపై పలు మార్పులు చేయాలని రాష్ట్రం కోరినట్లు సమాచారం. అయితే, ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోని అజెండా అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అభిప్రాయాలను మీడియాకు వెల్లడించేందుకు సీఎస్నిరాకరించారు.

బిల్లు నేపథ్యం.. 31వ రోజు ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా పదవి రద్దు! 

ఐదేండ్లు లేదా అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయి, కనీసం 30 రోజుల పాటు జైళ్లో కొనసాగితే.. పీఎం, సీఎంలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులను పదవి నుంచి తొలగించే ఈ బిల్లును గతేడాది కేంద్ర ప్రభుత్వం లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సవరణ చట్టంగా మారితే, మంత్రులు 30 రోజులు జైళ్లో ఉన్న పక్షంలో, 31వ రోజున వారి పదవి ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా రద్దవుతుంది.

గతేడాది ఈ బిల్లు లోక్‌‌‌‌‌‌‌‌సభలో పెద్ద దూమారాన్ని సృష్టించింది. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఈ బిల్లును వ్యతిరేకించడంతో, కేంద్రం దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపింది. ఈ నేపథ్యంలోనే లోక్‌‌‌‌‌‌‌‌సభ సెక్రటేరియట్ జేసీసీఏ అండ్ యూటీబీ సెల్ ఆధ్వర్యంలో తాజాగా ఈ జాయింట్ కమిటీ సమావేశమై, సవరణ బిల్లుపై ఆయా రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను సేకరించింది.