కానిస్టేబుల్ ​ఇంటర్వ్యూలకు వెళ్లారని యువకుల కిడ్నాప్‍

కానిస్టేబుల్ ​ఇంటర్వ్యూలకు వెళ్లారని యువకుల కిడ్నాప్‍
  • ఏడుగురు యువకుల కిడ్నాప్‍
  • కానిస్టేబుల్ ​ఇంటర్వ్యూలకు వెళ్లారని అపహరించిన నక్సల్స్​
  • వెతకడానికి వెళ్లిన నలుగురు గ్రామస్థులు కూడా..

భద్రాచలం, వెలుగు: చత్తీస్‍గఢ్‍ రాష్ట్రంలో మావోయిస్టులు ఏడుగురు యువకులను కిడ్నాప్‍ చేశారు. వీరిని వెతకడానికి అడవులకు వెళ్లిన నలుగురు గ్రామస్థులు కూడా వెనక్కు రాకపోవడంతో వారి అదుపులోనే ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‍స్టేషన్‍ పరిధిలోని కుందేడ్‍ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీస్‍ కానిస్టేబుళ్ల నియామక ఇంటర్వ్యూలకు వెళ్లారు. విషయం తెలిసి మావోయిస్టులు ఈ నెల 18న రాత్రి ఆయుధాలతో వచ్చి వారిని వెంట తీసుకెళ్లారు. బలవంతంగా తీసుకెళ్లడంతో వారి బంధువులు కూడా నక్సల్స్ వెంట అడవుల్లోకి వెళ్లారు. కానీ వారు కూడా తిరిగి రాకపోవడంతో నక్సల్స్ నిర్బంధంలో చిక్కుకున్నారని భావిస్తున్నారు. అయితే పోలీసులు దీన్ని ఇంకా ధ్రువీకరించడలేదు. 

మాజీ నక్సలైట్ హత్య
బీజాపూర్‍ జిల్లా గంగులూరులో మావోయిస్టులు మాజీ నక్సలైట్‍ను సోమవారం రాత్రి హత్య చేశారు. వింజమ్‍రాజు అనే నక్సలైట్‍ఆరేళ్లుగా స్వగ్రామం గంగులూరులో వ్యవసాయం చేసుకుంటున్నాడు. సోమవారం బీజాపూర్‍ పక్కనే ఉన్న పదేరా వార సంతకు నిత్యావసర వస్తువుల కోసం వెళ్లినప్పుడు మావోయిస్టులు రాజును కిడ్నాప్‍ చేసి తీసుకెళ్లారు. హత్య చేసి రహదారిపై పడేశారు. బీజాపూర్​ ఎస్పీ కమలోచన్‍ కశ్యప్‍ ఈ హత్యను ధ్రువీకరించారు.

ఎన్‍కౌంటర్‍లో ఐటీబీపీ జవాన్​మృతి
నారాయణ్‍పూర్‍ జిల్లా చోటేడోంగర్‍ ఐటీబీపీ 45వ బెటాలియన్‍కు చెందిన జవాన్‍ శివకుమార్‍ మంగళవారం నక్సల్స్ కాల్పుల్లో చనిపోయాడు. ఎమ్మెల్యే చందన్‍ కశ్యప్‍ పర్యటన నేపథ్యంలో కూంబింగ్‍కు బయలుదేరిన ఐటీబీపీ బృందం డోంగేర్‍ గుట్టలకు చేరుకోగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు తేరుకుని కాల్పులు జరిపేలోపే అడవుల్లోకి పారిపోయారు. ఈ కాల్పుల్లో శివకుమార్‍ అనే జవాన్‍ అక్కడికక్కడే మరణించగా, మరో జవాన్‍కు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నారని బస్తర్‍ ఐజీ సుందర్‍రాజ్‍ చెప్పారు.