పైశాచికానందం కోసమే.. కేసీఆర్ ఎంక్వైరీ: కేటీఆర్

పైశాచికానందం కోసమే.. కేసీఆర్ ఎంక్వైరీ: కేటీఆర్
  • సీఎం రేవంత్ నిప్పుతో చెలగాటమాడుతున్నారు: కేటీఆర్​
  • కేసీఆర్​ను ముట్టుకుంటే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్టే
  • ఢిల్లీకి 60 సార్లు పోయి.. కేసుల మాఫీ కోసం కాళ్లు పట్టుకున్నవ్
  • సజ్జనార్ జడ్జి కాదు.. లీకులు ఇస్తే సహించేది లేదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: కేవలం సీఎం రేవంత్​రెడ్డి పైశాచిక ఆనందం కోసమే మా నాయకుడు కేసీఆర్ ను విచారణ పేరుతో గంటల తరబడి కూర్చోబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం నిప్పుతో చెలగాటమాడుతున్నారని, కేసీఆర్ ను ముట్టుకోవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకోవడమేనని అన్నారు. మంగళవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ‘‘నిన్న కేసీఆర్ నంది నగర్ కు వస్తే అధికారికంగా 900 మంది పోలీసులను పెట్టారు. అనధికారికంగా ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇంత మంది పోలీసులు అక్కడ ఉంటే.. హైదరాబాద్ లో పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. జలవనరులు, సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. నల్లమల సాగర్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు’’ అని ఆరోపించారు.

సింగరేణి స్కామ్ పై కిషన్ రెడ్డి సైలెంట్...

‘‘సీఎం రేవంత్ రెడ్డి కేవలం తన కేసుల మాఫీ కోసమే ఢిల్లీకి వెళ్లి పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా నోరు మెదపట్లేదు. బయో ఫార్మా తయారీకి రూ.10 వేల కోట్లు కేటాయించి తెలంగాణకు పైసా ఇవ్వలేదు. ఇదేనా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గెలిచి సాధించింది?’’ అని ప్రశ్నించారు. ‘‘సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నోరు విప్పడం లేదు? సృజన్ రెడ్డి కాల్ డేటా బయటపెడితే అసలు దొంగలు దొరుకుతారు. కానీ కిషన్ రెడ్డి ఒక శాఖాపరమైన కమిటీ వేసి చేతులు దులిపేసుకున్నారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు’’ అని విమర్శించారు.

అత్యుత్సాహం చూపే ఆఫీసర్లకు వార్నింగ్..

‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదట్నుంచీ అబద్ధాలే. ఫస్ట్ బిజినెస్ మెన్ అన్నారు.. తర్వాత సినిమా వాళ్లు అన్నారు.. ఇప్పుడేమో ఏమీ లేదంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకేముందని నిన్న కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో.. నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా వచ్చింది. ఎలాంటి తప్పిదాలు చేయలేదు. ప్రభుత్వం ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలి. సజ్జనార్.. మీరేం జడ్జి కాదు. మీరు తీర్పులివ్వకండి. కాంగ్రెస్ నేతలు ఇచ్చే లీకులను మీడియా యథాతథంగా ప్రసారం చేయొద్దు. అత్యుత్సాహం చూపే అధికారులను హెచ్చరిస్తున్నాం. విచారణ గదిలో ఏం జరుగుతుందో బయటవాళ్లకు ఎలా తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు.