ప్రైవేట్ హాస్పిటల్స్లో భారీగా సిజేరియన్లు

ప్రైవేట్ హాస్పిటల్స్లో భారీగా సిజేరియన్లు
  • ప్రతి వందలో 75 కోత కాన్పులే
  • 5 జిల్లాల్లో 90 శాతానికి మించి సిజేరియన్లు 
  • ఆడిటింగ్‌‌‌‌ ఆపేసిన అధికారులు
  • మరింతగా పెరుగుతున్న ఆపరేషన్ డెలివరీలు

హైదరాబాద్, వెలుగు:  దేశంలో అత్యధిక సిజేరియన్ డెలివరీలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఈ ఏడాది కూడా అపఖ్యాతి మూటగట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించే రిపోర్ట్‌‌‌‌లో వరస్ట్ పర్‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్‌‌‌‌తో తెలంగాణ చివరన నిలుస్తోంది. డెలివరీల కోసం ప్రైవేట్ దవాఖాన్లకు పోతున్న ప్రతి 100 మందిలో 80 నుంచి 90 మందికి డాక్టర్లు సిజేరియన్ డెలివరీలే చేస్తున్నారు. గతంలో సిజేరియన్లపై సీరియస్‌‌‌‌గా ఆడిటింగ్ చేయడం, ప్రతి సిజేరియన్‌‌‌‌కు కారణాలు చెప్పాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆపరేషన్ కాన్పులు కొంత వరకూ తగ్గాయి. కానీ ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు ఆడిటింగ్ ఆపేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ సిజేరియన్ల శాతం భారీగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌లో కలిపి జనవరి నెలలో 14,756 డెలివరీలు జరిగితే, అందులో 11,112(75.3 శాతం) సిజేరియన్ డెలివరీలే ఉన్నాయి. సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాల్లో 90 శాతానికిపైగా సిజేరియన్ డెలివరీలు జరిగాయి. ప్రైవేటు దవాఖాన్లతో పోలిస్తే, ప్రభుత్వ దవాఖాన్లలో సిజేరియన్లు (46.7 శాతం) చాలా తక్కువగా జరిగాయి. 

కారణాలు ఇవే..  

సిజేరియన్లు పెరగడానికి ప్రైవేట్ హాస్పిటళ్ల దురాశతోపాటు, ఈ తరం మహిళల్లో వచ్చిన మార్పులు కూడా ఓ కారణమేనని చెప్తున్నారు. నార్మల్ డెలివరీ అయితే రూ.20 నుంచి 30 వేలు వసూలు చేస్తున్న హాస్పిటళ్లు, సిజేరియన్‌‌‌‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ చార్జ్ చేస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్‌‌‌‌లో డెలివరీకి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ చేయడం డాక్టర్లకు చాలా సులభం కావడం కూడా ఈ కాన్పులు పెరగడానికి మరో కారణమని కూడా ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నారు. ప్రెగ్నెంట్ కు ఏదో ఒక సమస్య ఉందని కుటుంబ సభ్యులను భయపెట్టి సిజేరియన్ల వైపు మొగ్గు చూపేలా డాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది ముహూర్తాలు పెట్టుకుని, ఆ సమయంలోనే పిల్లలను కనాలని డాక్టర్లపై ఒత్తిడి చేసి మరీ సిజేరియన్లు చేయించుకుంటున్నారు. వీటికి తోడు ఇప్పటి యువతులు లేబర్ పెయిన్స్ భరించకపోవడం, నార్మల్ డెలివరీ జరగడానికి అవసరమైన వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలు కూడా సిజేరియన్లు పెరగడానికి కారణమవుతున్నాయని చెప్తున్నారు.

దేశ సగటు కంటే మూడింతలు

దేశంలో ఏటా సగటున 23 నుంచి 30 శాతం మాత్రమే సిజేరియన్లు జరుగుతుండగా.. 70 నుంచి 77 శాతం నార్మల్ డెలివరీలు జరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కలు చెప్తున్నాయి. మన రాష్ట్ర పరిస్థితి మాత్రం ఇందుకు రివర్స్‌‌‌‌లో ఉంది. దాదాపు 60 నుంచి 70 శాతం సిజేరియన్లు జరుగుతుండగా.. 30 నుంచి 40 శాతం మాత్రమే నార్మల్ డెలివరీలు అవుతున్నాయి.