ఎల్‌ఐసీకి కొత్త బిజినెస్ ప్రీమియంల నుంచి రూ. 10,938 కోట్ల ఆదాయం

ఎల్‌ఐసీకి కొత్త బిజినెస్ ప్రీమియంల నుంచి రూ. 10,938 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌, వెలుగు:  ఎల్‌ఐసీ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌‌ (క్యూ1) లో రూ. 34 వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఈ సంస్థ  మొత్తంగా రూ. 46,444 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, రూ. 12 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మింది. కంపెనీ ప్రాఫిట్ క్యూ1 లో ఏడాది ప్రాతిపదికన రూ. 24.36 కోట్ల నుంచి రూ. 603 కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే.  నాన్‌ పార్టిసిపేటింగ్ పాలసీలపై (ఇన్వెస్ట్​మెంట్ల నుంచి వచ్చిన లాభాలను పాలసీహోల్డర్లతో పంచుకోవాల్సిన అవసరం లేని పాలసీలు)   ఫోకస్ పెంచుతున్నామని  కంపెనీ చైర్మన్ ఎంఆర్‌‌ కుమార్ అన్నారు. ఈ టైప్‌ పాలసీల నుంచి వచ్చే మార్జిన్ పెరుగుతోందని అన్నారు.  కంపెనీ జూన్ క్వార్టర్‌‌లో రూ. 3,015.38 కోట్లను ప్రొవిజినింగ్‌ కోసం పక్కన పెట్టింది. లేకపోయి ఉంటే కంపెనీ లాభం ఇంకా ఎక్కువగా ఉండేది.  

ఎల్‌ఐసీకి ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌లో  ఇండివిడ్యువల్ సెగ్మెంట్‌లోని కొత్త బిజినెస్ ప్రీమియంల నుంచి రూ. 10,938 కోట్ల ఆదాయం వచ్చింది.  ప్రీమియం రెన్యువల్స్ నుంచి రూ. 49,069 కోట్ల రెవెన్యూ  వచ్చింది. మొత్తంగా ఇండివిడ్యువల్‌ సెగ్మెంట్‌లో  రూ. 60,007 కోట్ల ప్రీమియంను కంపెనీ జూన్ క్వార్టర్‌‌లో సాధించింది.  బిజినెస్ సెగ్మెంట్‌లోని గ్రూప్ పాలసీల నుంచి రూ. 38,345 కోట్లను ప్రీమియం కింద సంస్థ సాధించింది. ఇది కూడా కలుపుకుంటే కంపెనీకి జూన్ క్వార్టర్‌లో వచ్చిన మొత్తం ప్రీమియంల విలువ రూ. 98,352 కోట్లకు చేరుకుంటుంది.  ఈ టైమ్‌లో మొత్తం  36,81,764  పాలసీలను ఎల్‌ఐసీ అమ్మగలిగింది. ‌