రెండుసార్లు తుమ్మిళ్ల నుంచి లిఫ్టింగ్ బంద్

రెండుసార్లు తుమ్మిళ్ల నుంచి లిఫ్టింగ్ బంద్

గద్వాల, వెలుగు:  ఆర్డీఎస్​కింద ఆయకట్టు ఉన్న రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఖరీఫ్ లో ఇప్పటికే రెండుసార్లు తుమ్మిళ్ల నుంచి లిఫ్టింగ్ బంద్ చేశారు. తుంగభద్ర నదిలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో తాజాగా శనివారం నుంచి పంపింగ్ నిలిచిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 40 వేల ఎకరాల్లో సాగు చేసిన పత్తి, మిరప పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఆర్డీఎస్ పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే లక్ష్యంతో 2017లో రూ. 783 కోట్లతో తుంగభద్ర నదిపై రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద లిఫ్టును ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. మొదటి విడతలో రూ. 162 కోట్లతో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో వేరే ప్రాజెక్టుకు వాడిన పాత పైపులు, మోటార్లను తీసుకువచ్చి హడావిడిగా ఒక పంపును ఏర్పాటు చేసి 2018లో దాని స్టార్ట్ చేశారు. మళ్లీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. 

రిజర్వాయర్ల మాటేమిటి?

ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు రెండు పంప్ లు ఏర్పాటు చేయాలని, మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు గ్రామాల దగ్గర మూడు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ రిజర్వాయర్లు పూర్తయితే తుంగభద్రలో వరద ఉన్నపుడు నింపి ఇప్పుడు వాడుకునే వీలుండేది. కానీ హడావిడిగా కేవలం ఒక పంపును కంప్లీట్ చేసి ఆర్డీఎస్ కాలువలోకి పంపింగ్ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పటివరకు మూడు రిజర్వాయర్లకు సంబంధించి భూసేకరణ చేయకపోవడం, రెండో పంప్ ను కూడా కంప్లీట్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. నదిలో నీరున్నప్పుడు తుమ్మిళ్ల లిఫ్టును ప్రారంభించి ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటర్స్ 23, 24 మధ్యలో పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి నీరు 31వ డిస్ట్రిబ్యూటర్ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ 40 వరకు నీరు              ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఉండవల్లి, తక్కశిల, లింగనవాయి, బూడిదపాడు, ఇమాంపూర్, అలంపూర్, ఖాషాపురానికి చుక్క కూడా చేరడం లేదు. 

నీళ్లు ఉంటే అట్లా.. లేకుంటే ఇట్ల..

ఆర్డీఎస్ రైతులకు నీళ్లు ఉన్నా కష్టాలే, లేకున్నా కష్టాలే అన్నట్లుగా పరిస్థితి ఉంది. తుంగభద్ర నదిలో ఫుల్లుగా నీళ్లు ఉన్నప్పుడు ఒక మోటార్ ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే ఆర్డీఎస్ కాలువలకు రిపేర్లు చేయకపోవడంతో కాలువలు ఎక్కడికక్కడే తెగిపోతున్నాయి. గత ఏడాది మానవపాడు మండలంలో ఆర్డీఎస్ కాలువలు తెగిపోయి పంటలు మునిగి రైతులు నష్టపోయారు. ప్రస్తుతం తుంగభద్ర నదిలో నీరు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా కేవలం 40,000 ఎకరాలలోపే అందుతోంది. ఈ ఖరీఫ్ సీజన్ లో మొత్తం 5 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని అనుకున్నప్పటికీ ఇప్పటివరకు2.5 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. మార్చి చివరి వరకు నీళ్లు ఇస్తే తప్ప పంటలు పండే పరిస్థితి కనిపించడం లేదు. తుంగభద్రలో నీటి లభ్యత అంతంత మాత్రంగా ఉండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

నీటి లెవెల్ తగ్గింది

తుంగభద్ర నదిలో నీటి లెవెల్ తగ్గింది. ప్రస్తుతం నదిలో 290 మీటర్ల లెవెల్ లో నీరు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. 291.5 మీటర్లకు నీటి లెవెల్ పెరిగితేనే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరో 1.5 మీటర్ల లెవెల్ వరకు నీళ్లు పెరిగితే పంపింగ్ స్టార్ట్ చేస్తాం.
- విజయ భాస్కర్,  ఆర్డీఎస్ ఈఈ