పేదల భూముల్లో సఖీ భవన నిర్మాణం: . తహసీల్దార్​పై స్థానికుల దాడి

పేదల భూముల్లో సఖీ భవన నిర్మాణం: . తహసీల్దార్​పై స్థానికుల దాడి

పేదల భూముల్లో సఖీ భవన నిర్మాణం
అడ్డుకున్న స్థానికులు.. తహసీల్దార్​పై దాడి
ఇద్దరి ఆత్మహత్యా యత్నం

మహబూబాబాద్ ​అర్బన్, వెలుగు: తమ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తహసీల్దార్​పై దాడికి పాల్పడ్డారు. ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని గుమ్ముడూర్​రెవెన్యూ పరిధిలోని గాయత్రి గుట్ట పక్కన 287 సర్వే నంబర్​లో 500 గజాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు సఖీ కేంద్రానికి కేటాయించారు. ఆదివారం ఉదయం ఇక్కడ పనులు చేపడుతుండగా స్థానికులు అక్కడికి వచ్చి తమ స్థలంలో నిర్మాణాలు చేయవద్దని అందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీస్​బలగాలతో అక్కడికి జేసీబీలు తీసుకువచ్చి గుంతలు తీయించడం స్టార్ట్​చేశారు. దాంతో స్థానికులు వచ్చి పిల్లర్​గుంతలోకి దిగి ఆందోళన చేపట్టారు. మరికొందరు జేసీబీలను రోడ్డుపై అడ్డుకుని తహసీల్దార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్​ఉద్దేశపూర్వకంగానే తమ స్థలాన్ని సఖీ కేంద్రానికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తహసీల్దార్​ సమీప బంధువుకు ఫాతిమా హైస్కూల్​ వెనుక సర్వే నంబర్​551లో 2 ఎకరాల భూమి ఉందని, ఎటువంటి  వివాదం లేదని ఆ స్థలాన్ని ఎందుకు ప్రభుత్వ ఆఫీసులకు కేటాయించలేదని ప్రశ్నించారు. 80, వంద గజాల స్థలాలున్న పేదలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కొందరు మహిళలు తహసీల్దార్​రంజిత్​కుమార్​ను తిడుతూ ఆవేశంలో అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకుని తహసీల్దార్​ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. మరి కొందరు పిల్లర్​గుంతలోకి దిగారు. సుభద్ర అనే మహిళా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. బిక్షపతి అనే వ్యక్తి పెట్రోల్​ పోసుకున్నాడు. పోలీసులు వెంటనే అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కళ్లలో పెట్రోల్​ పోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

పేదలపై జులుం చేయొద్దు: ఎమ్మెల్యే

పేదలపై అధికారులు జులుం చేయొద్దని మహబూబాబాద్​ఎమ్మెల్యే శంకర్​నాయక్​ అన్నారు. బిక్షపతి, సుభద్రను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ సఖీ కేంద్రానికి స్థలం కేటాయించవద్దని గతంలోనే మినిస్టర్, కలెక్టర్​దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. నిరుపేదలకు అండగా ఉంటానని, ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని చెప్పారు.