కుల గణనను వ్యతిరేకిస్తున్నమోదీని మూడోసారి ప్రధాని కానివ్వద్దు :ఆకునూరు మురళి

కుల గణనను వ్యతిరేకిస్తున్నమోదీని మూడోసారి ప్రధాని కానివ్వద్దు :ఆకునూరు మురళి
  • 75 కోట్ల బీసీలకు మేలు జరగకుండా కుట్ర
  • మాజీ ఐఏఎస్ ఆకునూరి‌‌ మురళి
  • కరీంనగర్ చేరుకున్న జాగో తెలంగాణ బస్సు యాత్ర

కరీంనగర్, వెలుగు: దేశంలోని 75 కోట్ల బీసీలకు ఉపయోగపడే కుల గణనను వ్యతిరేకిస్తున్న మోదీని మూడోసారి ప్రధాని కానివ్వద్దని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. బీసీలు 60 శాతం ఉన్నారని, బీసీ కులగణన చేయాలన్న డిమాండ్​ను మోదీ ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. కులగణన చేయకుండా సుప్రీంకోర్టులో మోదీ కేసు వేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక, జాగో తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆదివారం ఉదయం కరీంనగర్ చేరుకుంది.

ఈ సందర్భంగా స్థానిక రైతు బజార్ లో కరపత్రాలు పంచి మోదీ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాలని కోరారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ పదేండ్లలో పన్నుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి తీసుకెళ్లిన మోదీ...కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టారని ఆరోపించారు. రైతులకు, చిన్న వ్యాపారులకు ఇచ్చిన రుణాలను మాఫీ చేయకుండా అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపారులకు రూ.16 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు చెల్లించిన లక్షల కోట్ల పన్నులు ఎక్కడికెళ్లాయన్నారు.  నాణ్యమైన ఉన్నత విద్య, వైద్యం, ఉపాధి, రైతు సంక్షేమం వంటివి ప్రభుత్వ ప్రధాన విధులని..ఈ నాలుగు అంశాల్లో పదేండ్లలో ఏమీ జరగలేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చారని,  పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎవరికొచ్చాయని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని, అందరూ సమానంగా 
ఉండాలన్న స్ఫూర్తికే ఆ పార్టీ విరుద్ధమన్నారు. ప్రొఫెసర్​ పద్మజా షా, ప్రొఫెసర్​ లక్ష్మీనారాయణ, హన్మేశ్​ పాల్గొన్నారు.