కొత్త ఏడాది 2026 అడుగుపెడుతున్న వేళ.. సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపే అనేక కీలక మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇవి ఆర్థికంగా వారి జోబులపై భారాన్ని నింపుతాయి. ఈ క్రమంలో ప్రజల జేబుపై నేరుగా ప్రభావం చూపే ఆ ముఖ్యమైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1. 8వ వేతన సంఘం అమలు:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఏడాది తీపి కబురు అందించనుంది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల జీతాలు, పెన్షన్లలో 20% నుండి 35% వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.4 నుండి 3.0 మధ్య నిర్ణయిస్తే.. కనిష్ట బేసిక్ పే గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
2. గ్యాస్ ధరల మార్పు:
కొత్త యూనిఫైడ్ టారిఫ్ విదానం వల్ల గృహ అవసరాలకు వాడే పీఎన్‌జీ ధరలు ఎస్‌సీఎంకు రూ.5 వరకు, వాహనాలకు వాడే సీఎన్‌జీ ధరలు కేజీకి రూ.2.50 వరకు తగ్గే అవకాశం ఉంది కొత్త ఏడాదిలో. గ్యాస్ పైప్‌లైన్ రవాణా ఖర్చులు తగ్గడమే దీనికి ప్రధాన కారణం.
3. లోన్ ఈఎంఐల భారం తగ్గుదల:
డిసెంబర్‌లో ఆర్‌బీఐ రెపో రేటును 0.25% తగ్గించడంతో, జనవరి నుండి బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ ఉంది. దీనివల్ల హోం, కారు, పర్సనల్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయి. అయితే ఇది పూర్తిగా బ్యాంకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
4. పాన్-ఆధార్ లింక్ గడువు:
డిసెంబర్ 31 లోపు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే.. జనవరి 1 నుండి మీ పాన్ కార్డు పనిచేయదు. దీనివల్ల బ్యాంక్ లావాదేవీలు ఆగిపోవడమే కాకుండా, ఆదాయపు పన్ను రీఫండ్‌లు కూడా నిలిచిపోతాయి. అంతేకాకుండా రూ. వెయ్యి పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
5. రేషన్ కార్డు ఈ-కేవైసీ:
రేషన్ కార్డుదారులందరూ డిసెంబర్ 31 లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. లేనిపక్షంలో జనవరి 1 నుండి ఉచిత లేదా సబ్సిడీ రేషన్ నిలిపివేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగించినందున, ఇదే చివరి అవకాశం కావచ్చు.
6. మైనర్లకు సోషల్ మీడియా ఆంక్షలు:
పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుండి రక్షించేందుకు 16 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై కఠిన నిబంధనలు రానున్నాయి. ఆస్ట్రేలియా తరహాలోనే భారత్ కూడా మైనర్ల కోసం ప్రత్యేక 'పేరెంటల్ కంట్రోల్' చట్టాలను అమలు చేయాలని చూస్తోంది. ఇవి వచ్చే ఏడాది అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ప్రముఖ కార్ల కంపెనీలు (Honda, Nissan, Mercedes-Benz) తమ వాహనాల ధరలను 1% నుండి 3% వరకు పెంచుతున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల భద్రత కోసం సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసే రూల్ అమలులోకి వస్తోంది. అలాగే ఇకపై బ్యాంకులు ప్రతి వారం సిబిల్ స్కోర్‌ను అప్‌డేట్ చేయనున్నాయి. ఇది లోన్స్ పొందటాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
