పార్టీ కన్నా దేశం మిన్న అని నమ్మి నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తి వాజ్ పేయి అని లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. వాజ్ పేయి ఏ పని చేసినా నిబద్ధతతో చేశారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా ఐక్యం చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. సుపరిపాలన అంటే ఏంటో వాజ్ పేయిను చూసి నేర్చుకోవాల్సిందేనని చెప్పారు. దేశంలో జాతీయ రహదారులు, టెలిఫోన్స్ రావడానికి వాజ్ పేయి నాంది అని పేర్కొన్నారు. 80 ఏళ్ల వయసులోనూ ఆర్థిక విధానాలపై సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఇవాళ అటల్ బిహారీ వాజ్ పేయి 98వ జయంతి సందర్భంగా ఆయనకు జయప్రకాశ్ నారాయణ నివాళులర్పించారు.
ఓటర్ల జాబితా ప్రక్షాళన వాజ్ పేయి దూరదృష్టి వల్లే జరిగిందని జయప్రకాశ్ నారాయణ అన్నారు. 91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన ఘనత వాజ్ పేయిదే అన్నారు. వాజ్ పేయి ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకుందని, పరిపాలనలో ఆయన మచ్చలేని వ్యక్తిగా మిగిలారని చెప్పారు. ఒక్క ఎంపీ ఓటు కొనకుండా, వారిపై ఒత్తిడి తీసుకురాకుండా పరిపాలన చేశారని గుర్తు చేశారు.
