అశోక్‌ గెహ్లాట్‌కు గుణపాఠం చెప్తాం: మాయావతి

అశోక్‌ గెహ్లాట్‌కు గుణపాఠం చెప్తాం: మాయావతి
  • రాజస్థాన్‌ సంక్షోభంపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి

జైపూర్‌‌: రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీలో బల పరీక్ష పెడితే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదని బీఎస్పీ తేల్చి చెప్పింది. ఈ మేరకు 6 గురు ఎమ్మెల్యేలకు విప్‌ కూడా జారీ చేసింది. దీనిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. అశోక్‌ గెహ్లాట్‌కు గుణపాఠం చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు. బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే వారిని కాంగ్రెస్‌లోకి విలీనం చేసుకుని అశోక్‌ గెహ్లాట్‌ మోసం చేశారని ఆమె అన్నారు. దీనిపై గతంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకున్నామని అవకాశం కోసం ఎదురు చూశామని చెప్పారు. అవసరమైతే ఇప్పుడు కోర్టుకు వెళ్తామని మాయావతి చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌ జారీ చేశామని, దాన్ని ధిక్కరిస్తే ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌ను కోర్టు తీరస్కరించగా… దానిపై మరో పిటిషన్‌ వేశారు.