ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నల్కేద వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువను దాటే క్రమంలో ఓ కారు కొట్టుకుపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒడిశా భువనేశ్వర్‌లోని జయదేవ్ విహార్ కు చెందిన ఒక ప్రముఖ ధాబా యజమాని తన ఫ్యామిలీ(ఎనిమిది మంది)తో ఉజ్జయిని బగళాముఖి అమ్మవారి దర్శనానికి కారులో బయలుదేరారు. భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువ నల్కేద వద్ద అడ్డువచ్చింది. ఆ ప్రవాహాన్ని లెక్కచేయకుండా కారును ముందుకు పోనిచ్చారు. అయితే, ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శనివారం తెల్లవారుజామున కాలువలో నీటి ప్రవాహం కాస్త తగ్గిన తర్వాత కారును బయటకు తీశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బలమైన ప్రవాహం వస్తున్నప్పటికీ, డ్రైవర్ తొందరపడి కాలువను దాటడానికి ప్రయత్నించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని పీఎంవో ప్రకటించింది.
