గవర్నర్ విమాన ప్రయాణానికి అనుమతించని మహా ప్రభుత్వం

గవర్నర్ విమాన ప్రయాణానికి అనుమతించని మహా ప్రభుత్వం

మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మధ్య విభేదాలు పెరిగాయి. అవి తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయి. గవర్నర్ విమాన ప్రయాణానికి మహా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన విషాద సంఘటన గురించి తెలుసుకునేందుకు విమానంలో డెహ్రడూన్‌ వెళ్లేందుకు కోశ్యారి సిద్ధమయ్యారు. ముంబైలోని విమానాశ్రయానికి వెళ్లి రెండు గంట‌ల పాటు వేచి ఉన్నారు. ప్రభుత్వ విమానంలో కూర్చున్న త‌ర్వాత 15 నిమిషాల తర్వాత టేకాఫ్‌కు అనుమ‌తి రాలేద‌ని ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చెప్పారు. దీంతో కోశ్యారి చివ‌రికి మ‌రో విమానంలో టికెట్ బుక్ చేసుకొని డెహ్రాడూన్ వెళ్లాల్సి వ‌చ్చింది.

అయితే దీనిపై గవర్నర్ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ డెహ్రాడూన్ పర్యటనపై వారం కిందటే ప్రభుత్వానికి సమాచారం అందించామని.. అయినప్పటికీ అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్ విమాన ప్రయాణం అంశంపై తన కార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని చెప్పారు.