హీట్ స్ట్రోక్ మరణాలపై ఏక్‌నాథ్ షిండేకు అజిత్ పవార్ లేఖ

హీట్ స్ట్రోక్ మరణాలపై ఏక్‌నాథ్ షిండేకు అజిత్ పవార్  లేఖ

మహారాష్ట్ర భూషణ్ అవార్డును ప్రదానం చేసే కార్యక్రమంలో 13 మంది హీట్ స్ట్రోక్ తో మరణించడంపై ఎన్‌సీపీ నేత అజిత్ పవార్, సీఎం ఏక్‌నాథ్ షిండేకు లేఖ రాశారు.ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. మరణించిన వారి బంధువులకు రూ.20 లక్షలు, బాధితులకు ఉచిత చికిత్సతోపాటు రూ.5 లక్షలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

నవీ ముంబైలోని శాటిలైట్ టౌన్‌సిప్‌లోని ఖార్ఘర్‌లోని కార్పొరేట్ పార్క్‌లో ఇటీవల మహారాష్ట్ర భూషణ్ అవార్డు కార్యక్రమం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించిన ఈ ఈవెంట్ కు హాజరైన వారిలో 13మంది వడదెబ్బకు గురై చనిపోయారు. మరో 600పైగా మంది ఆస్పత్రి పాలయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన వారికి పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2,50,000 ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. 

ఈ ఘటనపై పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. శివసేన(యుబీటీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తప్పెక్కడ జరిగింది తెలియాలన్నారు. ‘ఇది పూర్తిగా నిర్లక్షంగా కారణంగా జరిగిందే’ అని ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్ అన్నారు. ముఖ్యమంత్రి షిండే రాజీనామా చేయాలని ఆప్ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు ప్రీతి శర్మ డిమాండ్ చేశారు. ప్రజలను ఎండలో కూర్చొబెట్టి ఇబ్బందికి గురిచేయడాన్ని శివసేన(యుబీటీ) రాజ్యసభ సభ్యులు ప్రియాంక చతుర్వేది విమర్శించారు.