హస్తినకు మారిన ‘మహా’ రాజకీయం

హస్తినకు మారిన ‘మహా’ రాజకీయం

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. క్షణక్షణానికి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. శివసేన రెబల్స్ గ్రూపు ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదుపుతోంది. బీజేపీ పార్టీ మద్దతు కూడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మహారాష్ట్ర రాజకీయాలు హస్తినకు మారాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఫడ్నవీస్ నివాసంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ భేటీ అనంతరం ఆయన బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబట్టేలా ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోందని తెలుస్తోంది.  

మరోవైపు.. రెబల్స్ గ్రూపు నాయకుడు ఏక్ నాథ్ షిండే కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలను ఆయన కలువనున్నారని సమాచారం. అనంతరం ముంబాయికి వెళ్లి గవర్నర్ ను కలువనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం థాక్రేకు బలం నిరూపించుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరనున్నారని సమాచారం. తామే అసలైన శివసేన వారసులమని, శివసేన పార్టీ తమదేనని షిండే స్పష్టం చేస్తున్నారు. 40 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని. 2/3 మెజార్టీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు సుప్రీంకోర్టుకు చేరాయి. కోర్టులో వాదనలు జరిగాయి. దీంతో మహాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెబల్ నేతలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా షిండే వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. నోటీసులపై జులై 12 వరకు కోర్టు స్టే విధించింది.